బలగం!
బలగం సినిమా చూసాను.
కథ shortcut లో
తెలంగాణ పల్లెలో, అందరితో సరదాగా ఉండే ఒక రైతు కుటుంబ కథ. అతనికి ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. ఆ ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత బావ, బావ మరుదులకు మాట మాట పెరిగి ఆ పిల్ల పుట్టింటికి 20 సంవత్సరాల పాటు దూరమవుతుంది. మళ్ళీ తండ్రి చనిపోయాడని పుట్టింటికి వస్తుంది. చనిపోయిన తండ్రి కర్మలో పెట్టిన ప్రసాదం కాకులు ముట్టుకోవు. ఎన్ని మొక్కులు, మొక్కినా కాకులు రావు. చివరికి ఎరుకల కథ చెప్పేవాళ్ళ ద్వారా తండ్రి ఆత్మ నాకింత బలగం ఉంది, అయినా నాకు తృప్తి లేదు, మగ పిల్లలు ఆడ పిల్లను దగ్గరికి తీసుకోవాలి, పెద్దవాడు తమ్ముడిని చెల్లెలిని తన రెక్కల కింద కాపాడుకోవాలి అని చెప్తాడు. దాంతో పిల్లలు అందరూ కలిసిన తర్వాత కాకులు పడతాయి. అదీ కథ.
కొంచెం emotional touch ఉంటుంది. కొంచెం గుండెలు తడి అవచ్చు.
మళ్ళీ ఏవో జరిగిన సంఘటనలు తెరల మీద కదులుతున్నాయి. భీవారం వెళ్ళిపోయా...
నాయనమ్మ వెళ్లి పోయింది. చిన్న చెరువు దగ్గర జరిగిన కర్మల్లో కాకి కోసం పెట్టిన వాయస పిండాన్ని కాకులు తిరుగుతున్నాయి కానీ ముట్టుకోవడం లేదు. నాన్నతో ఉన్న వాళ్ళు అందరూ wait చేస్తున్నారు. అందరూ దండాలు పెట్టారు. తాతయ్య నాన్నతో పద్మను ఎప్పటి లాగే ప్రేమగా చూసుకుంటాము. బావగారి మర్యాదల్లో ఏ లోపం చేయం అని దణ్ణం పెట్టు అన్నాడు.
నాన్న అలాగే దణ్ణం పెట్టాక, కాకులు వచ్చి తిన్నాయి.
అలాగే నాయనమ్మ ఉన్నప్పుడు ఒకసారి సోది చెప్పే ఎరుకలసాని వచ్చింది. అప్పట్లో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు సోది అడుగుతూ ఉండే వాళ్ళు మన ఇంట్లో.
ఎరుకలసాని నుదుటి మీద పెద్ద బొట్టుతో, ఎడమ చంకలో వెదురుతో అల్లిన ఒక పెద్ద బుట్ట, ఆ బుట్టలో ఒక నున్నటి సన్నటి కర్ర, కుడి చేతిలో తంబురా మీటుతూ సోది చెప్తానమ్మ సోది అంటూ వచ్చేది. చాట నిండా బియ్యం తీసుకొచ్చి ఎరుకలసాని ముందు పెట్టే వాళ్ళు.
నాయనమ్మ, సీతమ్ముమ్మ, అమ్మ కానీ ఎరుకలసానికి ఎదురుగా కూర్చుని ప్రశ్నలు అడిగే వాళ్లు.
ఆరోజు సాయంత్రం school నుంచి వచ్చాను. ఆడవాళ్ళు అందరూ గుండ్రంగా ఎరుకలసాని చుట్టూ కూర్చొని ఉన్నారు. ఉస్సేన్ బూబు కూడా ఉంది.
నేనూ చూస్తూ కూర్చున్నా.
అమ్మ ఎరుకలసానికి ఎదురుగా కూర్చుంది.
మొదలెట్టే ముందు, తంబురా మీటుతూ కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గ పలుకు, తిరుపతి ఎంకన్న పలుకు, ఇలా దేవీ దేవతలను తలుచుకుని, నాతో అన్నీ నిజాలు పలికించి, ఈ అమ్మలను సల్లంగా సూడు అంటూ దణ్ణాలు పెట్టింది. ఒక రకమైన trans లోకి వెళ్లి పోయింది. కళ్ళు అరమోడ్పులైనాయి. కొద్దిసేపు తుంబుర సౌండ్ మాత్రమే వినిపించింది. అమ్మ చేతిలో ఆ నున్నటి కర్ర పెట్టింది.
కన్న బంధం అంటే కడుపు, ఉన్న బంధం అంటే బొట్టు, తోడ బుట్టిన వాళ్ళంటే భుజం, సోది పిలిచిన కారణమేంటో అడుగుతున్నావు. అంటూ అమ్మ బొట్టు చూపించింది
కష్టానికి, ఒరిగిన జీవి మాటడే సోది.
రాజునై వస్తున్నా. మహారాజుగా వస్తున్నా.
అంటే సీతమ్మమ్మ నువ్వెవరు. నీ పేరేంటి? అని అడిగింది.
పేరు అడిగావే తల్లి. నేను పులినైతే భుజం, సింహమైతే గడ్డం అని గడ్డం చూపింది. పేరడిగితే పులులు సింహాలు చెప్తావేంటి? అన్నది అమ్మమ్మ. అర్థం చేసుకోవాలి తల్లి. నా పేరు తిరుపతి సామి అయితే బొట్టు, యాదగిరి సామైతే గడ్డం అంటూ గడ్డం చూపింది.
అంటే వచ్చింది, ఆమె ద్వారా మాట్లాడేది నరసింహ పేరున్న వాళ్లన్న మాట. అమ్మతో సొదమ్మి ఇంకా
నీకు నాకు ఉన్న వరస, నీ తోడుకు తోడబుట్టిన జీవినమ్మా. నీ మగడు నాకు తమ్ముడమ్మా.
అప్పటికే అందరి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఉన్నన్ని రోజులు ఇంటి రాజు నేనేనమ్మా. మాయదారి రోగమొచ్చి నన్ను మింగింది కదమ్మా. అమ్మా పోలేక, పోలేక పొయ్యా, ప్రాణం విల విలా కొట్టుకున్నా. పెద్ద గండంలో ఎల్లి పోయా. నాకు ఇలాటి బాధ వచ్చింది. గాలిలో గాలి నయ్యానమ్మా. నెల బిడ్డ నిడిచి పోలేక పలవరించానే తల్లి.
అమ్మ, నాయనమ్మ సహా అందరి కళ్ళల్లో నీళ్ళు కారి పోతున్నాయి. సీతమ్మమ్మ కళ్ళు తుడుచకుంటూ 'ఏమయింది, నీ బిడ్డ బాగానే ఉన్నాడు కదా. ఇంకా ఎందుకు నీకు బాధ'. అంది.
సోదమ్మి, లయ బద్దంగా తుంబుర మీటుతూ, సగం మూసిన కళ్ళలోంచి అమ్మ వైపు చూస్తూ...
ఎక్కడున్నాడు నా బిడ్డ. నా మనుషుల మధ్యలో లేడు. ఎక్కడో ఇంటి పేరు కాని ఇంట్లో ఉన్నాడు. నా అమ్మ ఒళ్ళో లేడు, నా నాయన నా బిడ్డను వదిలేశాడు. నా ప్రాణం వాడి చుట్టూనే తిరుగుతూ ఉంటోంది తల్లి. నా బిడ్డను నువ్వే చూడు, చూస్తావు తల్లీ అంతా మంచే జరుగుతుంది అని అమ్మను కర్రతో టార్గెట్ చేసి చెప్పి, కరెంట్ పోయి టీవీ ఆగి పోయినట్టు, చేతిలో కర్రను బియ్యం చేటలో వేసి ఆ బియ్యాన్ని తీసి బుట్టలో పోసుకుని ఒక పాత చీరె ఇవ్వమ్మా. అని అడిగింది.
అయోమయంగా చూస్తూ కూర్చున్నా. అసలు ఏమి జరిగిందో అర్థం కాలేదు.
ఆ తర్వాత కస్తలలో ఉన్న శీనన్నయ్యను తీసుకొచ్చారు.
తర్వాత వేరే story.
అప్పటి నుంచి శీనన్నయ్య భీవారంలోనే ఉన్నాడు. మనందరం దూరం వచ్చాము.
No comments:
Post a Comment