Sunday, March 26, 2023

వారం వారం భీవారం విశేషాల సమాహారం!

వడగళ్ల వాన!

 

తీవ్రమైన దగ్గుతో రాత్రి నిద్ర ఉండటం లేదు. Lunch తర్వాత దగ్గు మందు తాగి మంచం మీద పడుకున్నా నా గదిలో. దాదాపు 3 గంటల నిద్ర తర్వాత మెలకువ వచ్చింది.

సాయంత్రం 5 గంటలు అవుతోంది. లేచి బయటకు వచ్చా, అదేమిటి 5 కాక ముందే చీకటి పడింది. Watch time తప్పు చూపించింది అనుకున్నా. Balcony నుంచి చూస్తే కనపడే city తెర వేసినట్టు మాయమైంది. 

నిద్రమత్తు కదా confuse అవుతున్నా అనుకున్నా. తీరా చూస్తే  భీకరమైన వాన. అడుగు దూరంలో ఉన్నది కుడా కనపడటం లేదు మన balcony లోంచి చూస్తుంటే.

బాల్కనీలో చిన్న మంచు రాళ్ళు పడుతున్నాయి. ఓహో, వడగళ్ల వాన అన్నమాట. 

ఇంకో  బాల్కనీలో సీతమ్మ, రాణి తడుస్తున్న బట్టలు తీస్తున్నారు. 

టీవీ ముందున్న సోఫాలో కూర్చున్నా. గుండ్రాల గుండ్రాల సినిమా మొదలైంది. 

అంతే ఈ వారానికి భీవారం విశేషానికి స్టోరీ దొరికింది.

అదీ 1987 ఇలాగే మార్చి నెల.

పెళ్లయి 4 నెలలు. ఎర్రచేలో వేరుశనగ పంటకు కాపలాకు వెళ్ళా.  ఆ సంవత్సరం పంట బాగా పండింది. పాత బావి దగ్గర వేరుశనగ  కాయలు కళ్ళంలో కుప్పలా పోశారు కూలి వాళ్ళు.  జీతానికి ఉన్న కొమ్మిసెట్టి వెంకటేశ్వర్లు నేను పొలంలో ఉన్నాము. దాదాపు 100 క్వింటాల కాయలు. 

ఆ రోజు సాయంత్రం 5 గంటలు అవుతోంది. పడమర దిశలో సూర్యుడు ఇంకా అస్తమించ లేదు. అప్పటి దాకా కళ్ళంలో మంచె మీద ఉన్న నేను కిందకు దిగుతూ casual గా మంచెకు తూర్పు వైపున ఉన్న బట్టీల గడ్డలో ఉన్న నిమ్మతోట వైపు చూశా. మన పొలానికి తూర్పు వైపున్న కొండల మీదనుంచి నల్లటి మబ్బు, సినిమాలో చూపించినట్టు చూస్తుండగానే పెరిగిపోతోంది. మబ్బు ఎంత నల్లగా ఉందంటే పెద్ద కాటుక కొండలా ఉంది. నేను పుట్టాక అంత నల్ల మబ్బు చూడలేదు. కొన్ని నిమిషాల్లోనే చుట్టూ చీకటి కమ్మేసింది. నేను, వెంకటేశ్వర్లు ఆశ్చర్యపోయి చూస్తున్నాం. ఇద్దరం గబ గబా శనగ కట్టెతో,  వర్షానికి కాయలు తడవకుండా కప్పేశాము. 

మంచె ఎక్కి గూట్లో కూర్చున్నా.  మంచె కింద వెంకటేశ్వర్లు నించున్నాడు. వర్షం మొదలైంది. మంచె ముందున్న కళ్ళం కనబడటం లేదు. అంత వాన. వడగళ్ళు పడుతున్నాయి. అంత పెద్ద వడగళ్ళు మళ్ళీ చూడలేదు. పిడికిటి size నుంచి ఒక కేజీ, 5 కేజీ రాళ్ల size లో పడుతున్నాయి. ఒక రాయి గడ్డి కప్పుని చీల్చుకుంటూ వచ్చి తలకు తగిలింది. అయితే గడ్డి కప్పు దాని వేగాన్ని తగ్గించడంతో తల పగల్లేదు. కాకపోతే ప్రాణం దిమ్మరపోయింది. ఇక ఇక్కడ ఉంటే గారేంటీగా బతికే అవకాశం లేదనిపించింది. అబ్బాయి గారు కిందికి రండి అంటూ వెంకటేశ్వర్లు పెద్దగా అరుస్తున్నాడు.  దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తున్న మంచె మేంచి ఒక్క దూకు దూకాను. అతి కష్టం మీద అడవి తీగలతో అల్లిన ఇంకో తడికను అడ్డంగా ఏర్పాటు చేస్తున్నాడు వెంకటేశ్వర్లు. వరసగా మంచు రాళ్ళు పడుతున్నాయి. అతను వామ్మో, వాయ్యో అంటూనే నన్ను తడిక కిందకు గుంజాడు. అయినా తడికను చీల్చుకుంటూ ఒకటి రెండు రాళ్ళు వీపు పగలకొట్టినయ్. ఎంత దెబ్బంటే, ఇప్పటికీ అది గుర్తొస్తే  ఉ... అన్నమాట. 

ఒక అరగంట సేపు కురిసిన వడగళ్ల వాన భీబత్సమే సృష్టించింది. వడగళ్ల వాన దెబ్బకు పొలం గుంటలు పడిపోయింది. ఇద్దరం చలితో భయంతో వణికి పోయాం. పొలమంతా మంచురాళ్లు పేరుకు పోయాయి. 

వాన ఆగింది. మేమిద్దరం ఇంకా చేతులు పట్టుకొనే ఉన్నాం. చీకటి పడింది. మంచె మీద ఉన్న రెండు టార్చ్ లైట్లలో  ఒకటి పగిలిపోయింది. దానిపైన ఒక మంచు రాయి ఉంది. 

రాత్రి 8 అవుతోంది అనుకుంటా. నాన్న పిలుపు వినబడింది. ఓయ్ అన్నా.  శీనన్నయ్యో, జానీనో పక్కన ఎవరో  ఉన్నారు. గుర్తులేదు. నాన్న వచ్చి కావిలించుకున్నారు. దగ్గరికొచ్చి మమ్మల్ని ఎట్లాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందేమో అని మేము కనబడక ముందే నన్ను, వెంకటేశ్వర్లుని పిలుస్తూ వచ్చారు. ఇద్దరం పలికే సరికి హమ్మయ్య ఇద్దరూ బతికే ఉన్నారు అనుకున్నారట. నాన్న చుట్టూ ఉన్న పొలాల వాళ్ళను పేర్లు పెట్టి పిలిచి అందరూ బానే ఉన్నారు అని happy అయ్యారు. అసలే మూడు నెలలయింది పెళ్లయి, ఏదన్నయితే ఇంటికొచ్చిన కొత్త పిల్ల ఎట్టా భగవంతుడా, నా కొడుకు క్షేమంగా ఉండాలని దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ వచ్చా  అన్నారు నాన్న. ఈ రాత్రి నేనుంటా నువ్వెళ్లు నన్ను ఇంటికి పంపించారు. వెళ్లేప్పుడు దారంతా మంచు బండలు పేరుకు పోయి ఉన్నాయి. మర్నాడు ఉదయం 9 గంటలకు నాన్నను relieve చేయడానికి మళ్ళీ పొలానికి వెళ్ళా. అప్పటికి కూడా దారిలో వాగు నిండా ఇంకా మంచురాళ్ళు ఉన్నాయి. అప్పట్లో ఇంత news coverage లేదు కాబట్టి ఆ విషయం పేపర్లలో రాలేదు.

No comments:

Post a Comment