|
కథా రామాయణం పిల్లలకు శ్రీరామ కథ |
అందరు తాతలకు కథలడిగే మనవలు, మనవరాళ్లు వుంటారు వాళ్ళల్లో ఒకతి నా మనుమరాలు సహస్ర. నా చిట్టితల్లికి చెప్పిన శ్రీరామ కథను మిగతా తాతల సౌకర్యార్థం |
ఓ రోజు బీరువాలో వున్న పుస్తకాలు అన్ని సర్దుతున్నాను. ఐదు సంవత్సరాల నా మనమరాలు సహస్ర నేను చేసేది చూస్తూ.
"ఈ బుక్స్ ఏంటి తాతా ఇంత లావుగా వున్నాయి, ఇన్ని వున్నాయి" అంది.
"ఇది రామాయణం" అన్నాను.
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణ మందారాన్ని చూపిస్తూ. ఇది రామాయణం, ఇవి తొమ్మిది పుస్తకాలు ఉంటాయి. మొత్తం ఆరు కాండలు అంటారు. దీనిని వాసుదాసు గారు వ్రాసారు.
"మీ ఆఫీసు వా" అన్నది.
కాదురా “రాముడు జేజ స్టోరీ” అన్నాను.
"స్టోరీ నా ఏమి స్టోరీ"
అన్నది.
"మాన్స్టర్ ప్రిన్సెస్
ని ఎత్తుకు పోతాడు. ప్రిన్స్ మాన్స్టర్ చంపి ప్రిన్సెస్ ని సేవ్ చేసి తెచ్చుకుంటాడు".
అని చెప్పాను.
మరి ఇది అంది భాగవతాన్ని చూపిస్తూ
ఇది లిటిల్ కృష్ణ స్టోరీ అన్నాను.
అంతకు ముందు రోజే టీవీ లో లిటిల్ కృష్ణ యానిమేటెడ్ మూవీ చూశాము ఇద్దరమూ కలిసి. దాన్లో చిన్ని కృష్ణుడి లీలలు ఆనందమూ ఆశ్చర్యము తో చూసింది. మరైతే ఈ స్టోరీస్ నాకు చెప్పవా తాతా ప్లీజ్ అంది.
రాత్రికి పడుకున్నప్పుడు చెప్తాలే. యిపుడు పనిఉంది అని ఆ పుస్తకాలన్నీ సర్దే పనిలో పడి పోయాను.
ఆ రాత్రి
"తాతా కథ చెప్పవా" అని నా మనుమరాలు సహస్ర నా దగ్గర పడుకొని నా చెంపమీద చేత్తో రుద్దుతూ గారంగా అడిగింది.
"ఏ కథ చెప్పనూ" అంటే, మాన్స్టర్ కథ చెప్పు. మాన్స్టర్ ప్రిన్సెస్ ని ఎత్తుకు పోతుంది కదా అది
చెప్పు లేకపోతే లిటిల్ కృష్ణ స్టోరీ చెప్పు అంది. ఆ రోజు ఉదయం బుక్స్ విషయాన్ని గుర్తుచేస్తూ.
నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. మా నానమ్మ కమలమ్మ గారి దగ్గర పడుకొని విన్న రామాయణ, భాగవత కథలు గుర్తొచ్చాయి. మా తాతగారు దుర్గరాజు లక్ష్మీనారాయణ గారు రోజూ రామాయణ పారాయణ చేసుకొనే విషయం గుర్తొచ్చింది. రామాలయ ప్రతిష్ట, ఆ ఆలయంలో రోజూ చేసే రామ భజన అంతా ఓ ఫ్లాష్ బ్యాక్ లా కళ్ళముందు గిర్రున తిరిగాయి.
ఓహ్, మాది కదా అదృష్టం. మా తాత గారూ, నానమ్మ, మా నాన్న గారూ మా చిన్నప్పుడు మాకు ఇలా రాత్రి పడుకునేముందు కథలు చెప్పేవారు. మా పిల్లలు పుట్టి పెరిగి వచ్చే సమయానికి పై ముగ్గురూ వెళ్లిపోవడం, మా అమ్మ అనారోగ్యం తో, మా నగర జీవితంతో మా పిల్లలు మన పురాణ కథలు, ఇతిహాసాల గురించి వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవడమే కానీ మేమేమీ చెప్పలేకపోయాము. ఇప్పుడు నా మానమరాలుకి ఆ లోటు రాకూడదని ముందుగా రామాయణం చెపుదామని నిర్ణయానికొచ్చాను.
చిరు కథా రామాయణం
బాలకాండ
"అయోధ్య" కు రాజు వయసులో పెద్ద వాడైన దశరథ మహారాజు. ఆయనకు ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి.
వాళ్లకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రఘ్నుడు అనే నలుగురు పిల్లలు.
ఓరోజు వాళ్ళ దగ్గరకు విశ్వామిత్రుడు అనే ఋషి వచ్చి దశరథుడిని "రామ లక్ష్మణులను నాతో పంపించండి, నేను చేస్తున్న యాగానికి వాళ్ళు రక్షణగా ఉండి రాక్షసులనుండి కాపాడుతారు" అని అడిగాడు.
దశరథుడు ముందు రామ లక్ష్మణులు చిన్నవాళ్లు అని ఒప్పుకోకపోయినా వాళ్ళ గురువు వశిష్ఠుడు "రామ లక్ష్మణులకు మంచి జరుగుతుంది పంపండి" అంటే పంపిస్తాడు.
రామ లక్ష్మణులను వెంటపెట్టుకొని విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్తోంటే దారిలో తాటకి అనే రాక్షసి వాళ్ళని మింగటానికి వస్తుంది. దాంతో రాముడు తాటకి ని చంపేస్తాడు.
విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్లిన తర్వాత యాగం జరిగేటప్పుడు ఆశ్రమము మీదికి దాడికి వచ్చిన రాక్షసులలో సుబాహుడు అనేవాడిని చంపేసి మారీచుడుని దూరంగా పడేట్టు కొడతాడు. యాగం పూర్తి అయిన తర్వాత రామలక్ష్మణులను వెంటపెట్టుకొని మిథిలా నగరానికి వెళ్తాడు విశ్వామిత్రుడు. దారిలో రాముడు ఓ చోట భర్తకు దూరమైన అహల్య అనే ఆమెను భర్త గౌతముని దగ్గరకు చేరుస్తాడు.
మిథిలా నగరంలో శివధనస్సు విరచి స్వయంవరంలో సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు రాముడు. లక్ష్మణునికి ఊర్మిళ, భరతునికి మాండవిని, శత్రఘ్నునికి శృతకీర్తిని ఇచ్చి పెళ్లి చేస్తారు.
అందరు అయోధ్యకొచ్చి హాయిగా వుంటారు.
అయోధ్యకాండ
అలా కొన్ని రోజులు గడిచాయి.
"ఆగు తాతా ఆగు" అంది నా మనుమరాలు సహస్ర.
“ఏంట్రా” అంటే.
వయసులో పెద్దవాడైన దశరథుడికి అంత చిన్నపిల్లలేంటి?
రాముడు, లక్ష్మణుడు చిన్న వాళ్ళని తెలిసీ విశ్వామిత్రుడు వాళ్ళను అంత పెద్ద రాక్షసులు వుండే దగ్గరకు ఎందుకు తీసుకు పోయాడు?
పెద్ద రాక్షసులను చిన్న వాళ్ళైనా రామలక్ష్మణులు ఎలా ఓడించారు?
పెద్ద వాడైన విశ్వామిత్రుడు ఉన్నప్పుడు, అహల్యను ఆమె భర్త దగ్గరకు రాముడు పంపడమేంటి?
స్వయంవరమంటే ఏంటి?
శివధనస్సు విరగ్గొట్టటమెందుకు?
ఓకే, శివధనస్సు విరగ్గొడితే రాముడికి సీత కు పెళ్లి చేశారు. మరి ఏమీ విరగ్గొట్టకుండా మిగతా ముగ్గురు పెళ్లిళ్లు ఎలా చేశారు?
అసలు రాముడు లక్ష్మణుడు ఇద్దరు మాత్రమే వెళితే, మరి భరతుడు శత్రఘ్నుడు ఎలా పెళ్ళికి వచ్చారు?
డీటెయిల్స్ లేకుండా స్టోరీ చెప్పొద్దు తాతా. క్లియర్ గా చెప్పవా?
ఓసి భడవా భలే అడిగావే? ఈ రోజుకి ఇంతే పడుకో.
రేపటి నుంచీ క్లియర్ గా
చెపుతాను అన్నాను నేనో నిర్ణయానికి వస్తూ.
ముందు నేను రామాయణం చదివి దాని యథాతథ కథా రూపాన్ని నా మనుమరాలికి చెపుదామనుకున్నాను. మా ఇంట్లో వున్న శ్రీ వాసుదాస స్వామి వారి శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం (మందరం) ను చదవాలని నిశ్చయించుకొని నా మనుమరాలికి ఉపోద్ఘాతంగా రామాయణాన్ని ఈ విధంగా పరిచయం చేశాను.
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖామ్ వందే వాల్మీకి కోకిలమ్!
కథా రామాయణం
ఎవరు ఏ కథ వ్రాసినా కథానాయకుడు, ప్రతినాయకుడు వారి ఇద్దరికీ మద్దతుగా ఇతర పాత్రలు ఉంటాయి.
ప్రతినాయకుడు అతి బలవంతుడు. మహా క్రూరుడు అయి ఉంటాడు. బలహీనులను, మంచి వాళ్ళను ఏడిపించేవాడూ, ఆడవాళ్లను చెరపట్టేవాడూ, లోకాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే వాడుగా ఉంటాడు. ప్రతి వ్యక్తి లో విరుద్ధ వ్యక్తిత్వము వున్నట్లే, ఒక్కోసారి మంచిగా వున్నట్టుగా ఉంటాడు. అతడే రావణుడు.
(ఇప్పటి పిల్లలకు అర్ధమయ్యే భాషలో ప్రతినాయకుడంటే బాహుబలి లో భళ్లాల దేవుడు, అవెంజర్స్ లో థానోస్, కే జి ఎఫ్ లో అధీర. రావణుడు వీళ్లకు కొన్ని వేల రెట్లు శక్తిమంతుడు, అన్ని లోకాలనూ గెలవగలిగిన వాడు అన్న మాట.)
మరి కథానాయకుడు తల్లి తండ్రులు, గురువులంటే భక్తి, అన్నదమ్ములంటే ప్రేమ, స్త్రీల పట్ల గౌరవం, సమాజమంటే బాధ్యత, విద్యా జ్ఞాన సంపన్నుడు, ఇచ్చినమాట తప్పకపోవడం, విరుద్ధ భావాలు, విరుద్ధ వ్యక్తిత్వాలు లేకుండా వుండడం, అందరిని సమంగా చూడడం, శత్రువులతో కూడా పొగడ్తలు పొందేవాడు, ఏ శక్తినైనా తన అపరిమిత శక్తితో భయం లేకుండా ఎదిరించేవాడూ, ధర్మాన్ని పాటించేవాడు, అధర్మాన్ని ఎదిరించేవాడు, మొదలు పెట్టిన పనిని పూర్తి అయ్యేంతవరకు వదలనివాడు, అందరికి మార్గదర్శి, ఆదర్శప్రాయుడు, అందంలో మగవారినికూడా మోహింప చేయ గలిగేవాడూ, స్నేహితులకు ధైర్యమయ్యేవాడు, శత్రువులకు మృత్యువయ్యేవాడు, కష్టంలోనూ, సుఖంలోనూ ఒకే విధంగా ఉండేవాడు, ఇన్నివున్నా వినయంగా ఉండేవాడు అయి ఉండాలి. ఉన్నాడు.
ఆయనే మన శ్రీ రాముడు.
కథానాయకుడంటే సినిమాల్లో చూపించేవాడు కాదు.
మనకున్న ఒకే కథానాయకుడు మన శ్రీరాముడు. ఆయన భార్య సీతాదేవి మాత్రమే కథానాయకి.
వారి జీవితాల్లో జరిగిన కథే రామాయణం.
నా మనుమరాలి కోసం మొదలు పెట్టిన ఈ కథా రామాయణ సంకల్పం నిర్విఘ్నంగా కొనసాగాలని గణపతిని, సరస్వతిని శ్రీ రామచంద్రుని ప్రార్థిస్తూ...
విఘ్ననాయక ప్రార్థన
శుక్లాంబరధరమ్ విష్ణుం శశి
వర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ
విఘ్నోప శాంతయేII
భారతీ ప్రార్థన
క్షోణి తలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి చంచరీక చయ సుందర
వేణికి రక్షితామర
శ్రేణికి దోయజాత భవ చిత్త
వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ
పుస్తక రమ్య పాణికిన్II
హనుమత్ ప్రార్థన
మనోజవమ్ మారుత తుల్య వేగమ్
జితేంద్రియమ్ బుద్ధిమతామ్
వరిష్ఠమ్
వాతాత్మజమ్ వానర యూధ ముఖ్యం
శ్రీరామ దూతం శిరసా నమామిII
ఆంజనేయ మతిపాటలాననం
కాంచనాద్రి కమనీయ విగ్రహమ్
పారిజాత తరుమూల వాసినమ్
భావయామి పవమాన నందనం
శ్రీ రామచంద్ర ప్రార్థన
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘు కులాన్వయ రత్న
దీపమ్
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామిII
వైదేహీ సహితం సురధృమతలే
హైమే మహామంటపే
మధ్యే పుష్పకమాసనే, మణిమయే,
వీరాసనే సుస్థితమ్
అగ్రేవాచయతి, ప్రభంజనసుతే
తత్వం మునిభ్యం పరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం
రామంభజే శ్యామలమ్II
రాముడు రక్షకుండు, రఘురాముని
నమ్మిన బంటనేను
నాకేమి భయంబు, చింతలికనేమిటి
కేమి ఘటించినన్
రఘు స్వామిదె కీర్తి, సత్యమిది
సత్యము నాకు బనేమటంచు
నేనీ మహనీయకీర్తివిని, నిన్నెర
నమ్మితి జానకీపతీII
చరితం రఘనాధస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం ప్రోక్తం, మహాపాతక
నాశనమ్II
బాలకాండ లోని పాత్రలు
– పరిచయం
వాల్మీకి - శ్రీ రామాయణ
రచయిత
నారదుడు - బ్రహ్మ కుమారుడు,
రామాయణాన్ని వాల్మీకికి వినిపించిన వాడు.
బ్రహ్మ - సృష్టికర్త, పురాణం
ఇతిహాసాల ప్రకారం ఈ సృష్టి అంతటికి మూలమైన వాడు. రామాయణ కావ్యాన్ని రచించమని వాల్మీకికి
చెప్పినవాడు.
శ్రీ రాముడు - శ్రీ మహా
విష్ణువు 7 వ అవతారము (కథానాయకుడు)
ధర్మస్వరూపము. ఒక మనిషి
ఎలా జీవించాలో ప్రవర్తించి చూపించాడు. రావణ వధ
కోసం అవతరించాడు.
సీతాదేవి - శ్రీ మహాలక్ష్మి, విష్ణువు ను అనుసరించి రామావతార
ప్రయోజనం కోసం సీతాదేవిగా జన్మించింది. (కథానాయిక)
భరతుడు - శ్రీ రాముని తర్వాత
జన్మించిన కైకేయి కొడుకు
లక్ష్మణుడు - భరతుని తర్వాత
పుట్టిన సుమిత్ర కొడుకు. శ్రీ రాముని ఎళ్లవేళలా వెంట ఉండేవాడు.
శత్రఘ్నుడు - దశరథుని 4వ
కుమారుడు. తల్లి సుమిత్ర, లక్ష్మణుని కవల సోదరుడు. ఎప్పుడూ భరతునికి తోడుగా ఉండేవాడు.
దశరథుడు - శ్రీ రాముని తండ్రి
కౌసల్య - శ్రీ రాముని తల్లి
సుమిత్ర - లక్ష్మణ, శత్రఘ్నుల
తల్లి
కైకేయి - భరతుడి తల్లి
వసిష్ఠుడు - అయోధ్య రాజ
గురువు
విశ్వామిత్రుడు - రామ, లక్ష్మణులకు
సకల అస్త్రాలను అందించిన గురువు. వారి వివాహానికి కారణమైనవాడు.
తాటకి - రాక్షసి, రామలక్ష్మణుల చేతిలో హతమైనది.
మారీచుడు – రాక్షసుడు -
తాటక కొడుకు
సుబాహుడు - మరో రాక్షసుడు
- తాటక కొడుకు
గౌతముడు - ఒక మహర్షి, అహల్య
భర్త
అహల్య - గౌతముని భార్య.
జనకుడు - మిథిలానగర రాజు,
సీతాదేవి, ఊర్మిళల తండ్రి
కుశధ్వజుడు - జనకుని తమ్ముడు,
మాండవి శృతకీర్తుల తండ్రి
ఊర్మిళ - జనకుని మరో కుమార్తె,
లక్ష్మణుని భార్య
మాండవి - కుశధ్వజుని కుమార్తె
శృతకీర్తి - కుశ ధ్వజుని
మరో కుమార్తె
శతానందుడు - జనక మహారాజుని
పురోహితుడు, గౌతముని కుమారుడు
పరశురాముడు - మహావిష్ణు
ఆరవ అవతారము, జమదగ్ని మహర్షి కుమారుడు
ముందుగా...
శ్రీ వాల్మీకి, రామాయణంలో
ఏ పాత్రగురించి తన అభిప్రాయము వ్యక్తీకరించడు. ఏ పాత్ర ఏ విధంగా ప్రవర్తించిందో వివరిస్తాడు.
మనమే మంచి చెడులను విశ్లేషించి, ఆయా పాత్రల గుణగణాలను అర్థం చేసుకుంటాము.
రావణుని దురాగతాలవల్ల లోకులు
పడే బాధలను తీర్చడానికి శ్రీ మహా విష్ణువు
శ్రీ రామునిగా అవతరించడం జరిగింది
ఈ కథా రామాయణము పిల్లలకు
అర్థమయ్యేవిధంగా ఉండాలని రావణుని ముందు పరిచయము చేస్తున్నాను.
అసలు రావణుడు ఎవరు? రావణుని
గుణగణాలు ఏమిటి? ఎందుకు శ్రీ రామావతార అవసరం ఏర్పడింది.
ఈ రోజుల్లో వివిధ మాధ్యమాల
ద్వారా రామాయణంలో రావణుడు, భారతం లో దుర్యోధనుడు, కర్ణుడు అన్యాయంగా, అక్రమంగా చంపబడ్డారని
మన పురాణాలను తప్పుగా చూపించడం జరిగింది, జరుగుతోంది.
మరి అసలు కథ ఏమిటి మనం మన
పిల్లలకు చెప్పము. సినిమాలు, నెట్ లో అందుబాటులో వున్న అబద్దపు, సంకర సాహిత్యాలను చాలా
మంది నమ్మి, పురాణాలను విశ్వసించలేని పరిస్థితికి వచ్చారు.
ఈ ధోరణి మన సమాజానికి చాలా
ప్రమాదకరమైనది. చిన్న తనంలో అసలు విషయాలను తెలుసుకొన గలిగితే...
గాంధీ, హోమీ భాభా , అబ్దుల్
కలాం ఎందుకు అంతగా పురాణాల గురించి చెప్పారో, వారు ఆ దారిలో ఎలా నడిచారో తెలుస్తుంది.
శ్రీ వాసుదాసులచే వ్రాయబడిన శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము మందరమును అనుసరించి ఈ కథా రామాయణాన్ని వివరించడము జరిగింది. శుద్ధ గ్రాంధికములో వంద సంవత్సరాల క్రితము వ్రాయబడిన ఈ రామాయణం శ్రీ వాల్మీకి రచించిన 24000 శ్లోకాల సంస్కృత రామాయణానికి యథాతథ అనువాదం. శ్రీ వాల్మీకి రామయణాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించేప్పుడు శ్రీ వాసుదాసులుఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా టీకా తాత్పర్య సహితంగా ఈ లోకానికి అందచేశారు.
అదే రామాయణాన్ని శ్రీ వాసుదాసుల ప్రశిష్యులు మా తాతగారు దుర్గరాజు లక్ష్మీనారాయణ గారు రోజూ రామాయణ పారాయణకు వీలుగా తాత్పర్యం మాత్రమే విడిగా వ్రాసుకున్నారు. దాని నుంచి నేను అతిసరళ వ్యావహారిక భాషలో ఇప్పటి తరానికి కూడా అర్థం అవాలని ఈ ప్రయత్నం చేసాను. ఇప్పటి తరానికి రామాయణ జ్ఞానాన్ని అందివ్వాలనే తపనతోనే తప్ప శ్రీ వాసుదాసుల ని కానీ, వారి అద్భుత కవిత్వపటిమను కానీ తక్కువ చేయడంలేదని, నా భావాన్ని సరిగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆ
పాండిత్యాన్ని అర్థం చేసుకునే శక్తి ఈ
తరంలో ఏ కొద్దిమందికో వుండవచ్చు. అయితే రామానుగ్రహమున్న వాళ్ళకు మందరం చేరవచ్చు. 1920 నాటి గ్రాంధిక భాష అర్థము చేసుకోవటానికి భయపడి అసలు రామాయణము చదవరేమోననే అపోహతో ఈ కథా రామాయణాన్ని అందిస్తున్నాను. శ్రీభాష్యం ఆప్పలాచార్య స్వామి వారు అన్నట్టు ఈ కథా రామయణం - బాలకాండలో ప్రత్యేకంగా ముఖ్యమైన మూడు సంఘటనలనే గమనంలోకి తీసుకున్నాను. శ్రీరామ జననం, యాగ సం రక్షణం, శ్రీ సీతారామ కళ్యాణం ఒక వరుసలో వ్రాసి, ఇక సందర్భానుసారం వచ్చే ఇతర కథలను విడిగా ఇస్తూ, మందరం ఆత్మ దెబ్బతినకుండా వుంచే ప్రయత్నం చే శాను. ప్రతి కాండ అయిపోయిన తరువాత శ్రీ వాసుదాసులు రచించిన సంక్షిప్త రామాయణాన్ని పిల్లలతో సహా అందరూ పారాయణ చేసుకోవడానికి అందచే శాను.
శ్రీ వాసుదాసులకు, నాలో శ్రీరాముని పట్ల, శ్రీరామయణం పట్ల ఆసక్తికి కారణమైన, నాకు గురుతుల్యులు, నిత్య
శ్రీరామాయణ పారాయణులు, ఈ కథలకు పుస్తక రూపమిచ్చేనందుకు
ప్రేరణ అయిన శ్రీమాన్ డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారికి, మా తాతగారు శ్రీ దుర్గరాజు లక్ష్మీనారాయణ గారికి, నా తల్లిదండ్రులు భారతిదేవి, శ్రీ పాండురంగ విఠల్ గార్లకి,
మా తాతగారు వ్రాసుకున్న తాత్పర్య రామాయణానికి ఏంతో శ్రమకోర్చి
పుస్తక రూపమిచ్చిన మా మేనత్త పద్మావతి గారి భర్త, మాకు ఎంతో
ఆదరణీయులు, ప్రేమాస్పదులు మా మామయ్యగారు శ్రీ ఆత్మకూరి
శ్రీమన్నారాయణ గారికి, నన్ను కన్న కొడుకులా ఆదరించిన మా
మేనమామ శ్రీ బసవరాజు గోపాలకిషన్ రావు(పెగళ్ళపాటి సీతారామ రావు) గారి పాదాలకు నమస్కరిస్తూ..
ఇక...
ఇంతకు ముందు చెప్పినట్టు
రావణుడు రామాయణంలో ప్రతినాయకుడు. ఇతని వంశము, పుట్టుక మొదలైనవి కథలో ముందు ముందు తెలుస్తుంది.
బ్రహ్మ దగ్గర నర వానరులు తప్ప దేవ, దానవ, యక్ష, కిన్నెర మొదలయిన అన్ని ప్రాణులనుండి
మరణ భయము లేకుండా వరాలు పొందాడు. ఆ వరగర్వంతో
దేవతలను జయించి, సోదరుడైన కుబేరుడి లంకా నగరాన్ని ఆక్రమించాడు. యజ్ఞ యాగాదులను జరిపే
మునులను హింసించేవాడు. స్త్రీలను చెరబట్టేవాడు. విపరీతమైన యుద్ధకాంక్షతో ముల్లోకాలను
తన ఆదేశాలకు అనుగుణంగా నడవాలనేవాడు.
రావణుని బారినుంచి లోకాలను
రక్షించమని దేవతలు, మునులు మొదలైనవాళ్లంతా బ్రహ్మదేవుణ్ణి కలిసి రక్షించమని వేడుకుంటారు.
ఇక బ్రహ్మదేవునితో సహా అందరూ
శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి వారిముందు ప్రత్యక్షమై నేను దశరథునికి
నలుగురు కుమారులుగా జన్మించి పదకొండు వేల సంవత్సరాలు నరునిగా చరించి ధర్మ సంస్థాపన
చేస్తాను. రావణ సంహారానికి మిగిలిన దేవతలు వారి వారి అంశలతో వానరులుగా జన్మించి రావణ
సంహారంలో వారి పాత్ర వారు నిర్వహించమని చెప్పాడు.
సిద్ధి మంత్రం
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయై
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై|
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
నమోఽస్తు చన్ద్రార్క మరుద్గణేభ్యః
శ్రీ రామ జయమంత్రం
జయ త్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్ధయిత్వా పురీం లంకా మభివాద్య చ మైథిలీం
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసామ్
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి ర్యది
పౌరుషే చాప్రతిద్వంద్వ శ్శరైనం జహి రావణిమ్
రామాయణం ఇలా మొదలయింది….
బాలకాండ
వాల్మీకి మహాఋషి ఆశ్రమానికి ఓరోజు నారదుడు వచ్చాడు.
వాల్మీకి నారదునికి నమస్కరించి కుశల ప్రశ్నలు వేసి, అతిథి మర్యాదలు చేసాడు.
కొంతసేపాగి వాల్మీకి నారదుణ్ణి ఇలా అడిగాడు.
"మహానుభావా ఈ లోకంలో ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడేవాడు, ధర్మం తప్పని వాడూ , మంచి కోసం చెడుని ఎదిరించి గెలిచేవాడూ, ఉత్తమమైన గుణములు వున్నవాడూ, మహా వీరుడూ, చూసేకొద్దీ చూడాలనిపించే అంత అందమైన వాడూ మొదలయిన గొప్ప లక్షణాలున్నవాడు ఎవరైనా ఈ లోకంలో వున్నాడా" అని అడిగాడు.
"ఉన్నాడయ్యా వాల్మీకీ, ఆయన శ్రీరామచంద్రుడు. అయోధ్య మహారాజు" అని శ్రీరాముడు పుట్టుక నుంచి పట్టాభిషేకం వరకూ జరిగింది చెప్పి వెళ్లి పోయాడు.
తరువాత తమసా నదికి స్నానం చేయడానికి వెళ్లి అక్కడ పక్షులను వేటాడే ఒక బోయవాడు జంటగా ఉన్న రెండు పక్షులలో మగపక్షినిబాణమేసి చంపాడు. మిగిలిన ఆడ పక్షి ఏడుస్తూ ఆ చనిపోయిన పక్షి చుట్టును తిరుగుతూ ఏడుస్తోంది. అది చూసిన వాల్మీకికి కోపంతో ఆ బోయవాడిని ఇలా శపించాడు.
"మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్"
"ఓరీ కిరాతకుడా! పక్షిజంటలో ఒకదానిని చంపి, నీవు శాశ్వతంగా చెడ్డవాడివయ్యావు." వాడు భయపడి పారిపోయాడు.
ఆశ్రమానికి వచ్చిన వాల్మీకి నేను ఎందుకిలా అన్నాను. ఎందుకింత బాధగా మాట్లాడాను.
అని ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ, దేవతలతో కలసి వచ్చాడు.
బ్రహ్మ వాల్మీకితో
"వాల్మీకీ, బాధపడకు. నువ్వు తప్పు చేయలేదు. నీ నోటిలోంచి వచ్చిన శ్లోకం మాదిరిగానే రామకథ రచన చేసి, లోకానికి అందచెయ్యి. నీ బాధ కూడా తగ్గిపోతుంది" అని చెప్పాడు.
‘‘నా అనుగ్రహంతో రామకథలోని ఎవరెవరు ఏఏ పనులు చేసిందీ, వారేం మాట్లాడిందీ, ఎలా ఆలోచించిందీ అన్నీ నీ దివ్యదృష్టికి తెలుస్తాయి. నువ్వు రచించిన శ్రీ రామకథ ఈ లోకం అంతటా వ్యాపించి, పర్వతాలూ, సముద్రాలూ, సూర్య చంద్రులూ ఉన్నంతకాలం ఉంటుంది" అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
వాల్మీకి రామకథను పూర్తి చేశాడు. ఈ కథ పాడుకోవడానికి వీలుగా కూడా ఉంది.
ఆయన ఆశ్రమంలోనే ఉన్న లవ కుశలకు ఈ కథను నేర్పి, లోకంలో ప్రచారం చెయ్యమని పంపాడు.
లవకుశులు ఇద్దరూ రామకథ పాడుకుంటూ అయోధ్య చేరారు. అయోధ్యలో జనమంతా మైమరచిపోయి రామకథను వింటున్నారు. అది విని శ్రీ రాముడు లవకుశులను సభకు పిలిపించి శ్రీ రామకథను అందరితో కలసి కింద కూర్చుని తన్మయత్నంతో వింటున్నాడు.
లవకుశులు రామకథ మధురంగా వినిపిస్తున్నారు.
శ్రీరామ జననం
అయోధ్య చాల గొప్ప నగరం.
కోసలకు రాజధాని. రాజు పేరు దశరథుడు.
ఆయనకు ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి.
దశరథ మాహారాజు ముసలి వాడయ్యాడు. అరవై వేలవ పుట్టినరోజుకూడా అయిపోయింది.
ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆరోజు వారి రాజగురువు వసిష్ఠ మహాఋషిని కలిసి "నేను ముసలి వాడినయ్యాను. ఇంతవరకూ పిల్లలు పుట్టలేదు. నాకు ఓపిక తగ్గిపోతోంది. ఏదైనా పూజ చేస్తే దేవుడు దయతలచి పిల్లలు కలగటానికి దారి చూపుతాడేమో చెప్పండి" అన్నాడు.
దానికి వసిష్ఠుడు "సరే రాజా, పుత్రకామేష్ఠి అని ఒక యాగము చేద్దాం. మీ కోరిక తీరుతుంది. ఆయాగం చేయించడానికి ఋష్యశృంగుడు అనే ఒక గొప్ప ఋషి సహాయం తీసుకుందాం". అన్నాడు.
పుత్రకామేష్ఠి యాగము అంటే, పుత్రులు అంటే పిల్లలు కావాలని చేసే ఒక యాగము.
"తాతా" అంది నా మనుమరాలు.
"ఏమ్మా మళ్ళీ ఏమిటి" అన్నాను.
"ఎందుకంత పెద్ద పూజ అదే యాగం". అని అడిగింది.
ఎందుకంటే అందరి పూజలు అందుకునే వాడూ, అందరికి దిక్కైన వాడూ, అన్నిటికన్నా గొప్పవాడూ అయిన శ్రీమహావిష్ణువు మనిషిగా దశరథుడికి పుడతానని, రావణాసురుడిని చంపుతానని, లోకాలకు రక్షగా ఉంటానని అంతకుముందు దేవతలకు వరమిచ్చాడు. మరి ఆయన పుట్టాలంటే ఎంతో పుణ్యము, ఎన్నో పూజలు చేయాలి మరి.
సరే నువ్విలా ప్రతిసారి అడ్డం తగలొద్దు. దీన్ని బాలకాండ అంటారని చెప్పా కదా. ఇది చెప్పటం అయిపోయిన తర్వాత నీ డౌట్లు అడుగు. నేను క్లియర్ చేస్తా. ఇంకోటి, అన్ని కాండలకు ఇంతే మరి. మధ్యలో డిస్టర్బ్ చెయ్యొద్దు. అని తిరిగి కథలోకి వెళ్లిపోయాను.
అలా దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తున్నాడు. అంతలో ఆ యజ్ఞగుండం మధ్యలో ఒక పేద్ధ ఆకారం తో యాగ పురుషుడు బంగారుగిన్నెతో ప్రత్యక్షమై, దశరథ మహారాజా దీనిలోని పాయసాన్ని మీ భార్యలకు పంచు. నీకు అంతా మంచి జరుగుతుంది అని, ఆ పాయసాన్ని దశరథునికి ఇచ్చి మాయమైపోయాడు.
దశరథుడు ఆనందంతో ఆ పాయసంలో సగం పెద్ద భార్య అయిన కౌసల్యకు, మిగిలినదానిలో సగం సుమిత్రకు, ఆ మిగిలిన దాంట్లో సగం కైకేయికి ఇచ్చి, చేతిలో మిగిలిన నాలుగవ భాగాన్ని మళ్ళీ సుమిత్రకు రెండవసారి ఇచ్చాడు.
కొన్ని నెలలకు మొదటి సగం పాయసం తీసుకున్న కౌసల్యకు శ్రీ రాముడు, మూడవ భాగము తీసుకున్న కైకేయికి భరతుడు, రెండవ నాల్గవ భాగాలను తిన్న సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు కవలలుగా పుట్టారు.
శ్రీ రాముడితో లక్ష్మణుడు, భరతునితో శత్రుఘ్నుడు ఒక జట్టుగా వుండే వాళ్ళు.
రాముని వదిలి లక్ష్మణుడు ఒక్క క్షణమైనా ఉండేవాడు కాదు. అన్నకు తోడుగా లక్ష్మణుడు ఎప్పుడూ వెంటనే ఉండేవాడు.
అన్నదమ్ములు నలుగురూ గురువు గారు వశిష్ఠుని దగ్గర చదువుకుంటున్నారు.
పన్నెండు సంవత్సరాలు గడిచాయి.
విశ్వామిత్రుడు, రామలక్ష్మణుల సిద్ధాశ్రమ ప్రయాణం
ఒక రోజు దశరథ మహారాజు సభకు విశ్వామిత్ర మహర్షి వచ్చాడు.
దశరథుడు ఆయన్ని గౌరవించి, కుశల ప్రశ్నలు వేసి మీరు ఎందుకు వచ్చారు? మీకేమి కావాలో చెప్పండి. చేస్తాను అన్నాడు.
విశ్వామిత్రుడు సంతోషంతో “దశరథ మహారాజా, నేను చేసే యాగాన్ని రావణ అనుచరులైన రాక్షసులు మారీచ, సుబాహులు పూర్తి చేయనివ్వడం లేదు. రక్త మాంసాలతో మా ఆశ్రమాన్ని, యాగాన్ని అపవిత్రం చేస్తున్నారు. నేను వాళ్ళను చంపగలను కానీ, యాగం చేసేప్పుడు అలా చెయ్యకూడదు. అందుకని రామ లక్ష్మణులను యాగాన్ని కాపాడటానికి పంపు” అని అడిగాడు.
రామ లక్ష్మణులు పన్నెండు సంవత్సరాల వాళ్ళు, చిన్న పిల్లలు అని మొదట ఒప్పుకోలేదు దశరథుడు కానీ, వసిష్ఠ మహర్షి పిల్లలకు మంచి జరుగుతుంది పంపమన్న సలహా తో రామ లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి తో పంపించాడు.
రామ లక్ష్మణులతో విశ్వామిత్రుడు
సిద్దాశ్రమమనే అయన ఆశ్రమానికి బయలుదేరాడు.
అన్నదమ్ములిద్దరూ బంగారు
ఆభరణాలు ధరించారు. నడుముకి కత్తిని తగిలించుకొని, రెండు భుజాలకు పూర్తిగా బాణాలతో నిండి
వున్న రెండు అమ్ములపొదులను కట్టుకొని చూడటానికి మూడు తలలున్న నాగుపాములలా వున్నారు.
విపరీతమైన కాంతితో మెరిసిపోతున్నారు.
వాళ్ళ అందానికీ, ధైర్యానికీ
విశ్వామిత్రుడు ఆనంద పడిపోయాడు.
సాయంత్ర సమయానికి సరయు నదిని
దాటి అవతలి ఒడ్డుకు చేరారు.
అప్పుడు విశ్వామిత్రుడు రాముని చూసి "నదిలో స్నానం చేసిరండి మీకు చక్కని
మంత్రము నేర్పుతాను. దానివల్ల మీకు, ఆకలి, నిద్ర, అలసట ఉండవు. నిద్రలో ఉన్నప్పుడునైనా
మీకెవరూ అపకారము చేయలేరు." అని అన్నదమ్ములకు బల, అతిబల అనే బ్రహ్మ సృష్టించిన
మహామంత్రములను రామలక్ష్మణులకు నేర్పాడు. దానివల్ల రామలక్ష్మణులు విపరీతమైన తేజస్సు
పొందారు.
చీకటి పడిందని ఓ చోట ఆరాత్రి పడుకొన్నారు. మెత్తటి పరుపుల మీద పాడుకొనే రాజకుమారులు గడ్డి నేలమీద కూడా అదే విధంగా ఏ ఇబ్బంది లేకుండా పడుకున్నారు. ఎవరైనా ఇలా ఉండాలి అని నేర్చుకోవాలి. అన్ని రోజులూ ఒకేలా ఉండవు, ఏ పరిస్థితిలోనైనా ఒకే విధంగా ఉండడం నాయకుని లక్షణం. అది రామలక్ష్మణులు చిన్నతనంలోనే అలవాటు చేసుకున్నారు.
మరునాడు ఉదయాన్నే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నిద్ర లేపాడు.
ఇంకో విషయమేమిటంటే గురువు అంటే మనకు విద్య నేర్పేవాడు అంటే పాఠాలు మాత్రమేకాదు. ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలో ఆ విద్యలన్నీ ప్రేమగా బాధ్యతగా మననుండి ఏమీ ఆశించకుండా నేర్పేవాడు గురువు.
తాటక సంహారం
ఉదయాన్నే విశ్వామిత్రుడు రాముణ్ణి "నాయనా రామా లే నిద్ర లే నాయనా, సూర్యోదయమవుతోంది. మనం దేవతాకార్యం చేయవలసి ఉన్నది కదా, నిద్రలే" అని లేచిన రాముడు స్నానం చేసి, గాయత్రి జపం చేసికొనిన తర్వాత మళ్ళీ బయలుదేరారు.
ఆరోజంతా నడిచి, భీకరమైన హోరుమని శబ్దం వస్తోన్న వైపు చూద్దామని వెళ్లారు. సరయు నది గంగా నదిలో కలిసే ప్రదేశం అది. అక్కడ చాలా మంది ఎంతో జ్ఞానం ఉన్న ఋషులను చూశారు. ఆ నదీ సంగమంలో స్నానాదికాలు పూర్తి చేసుకొని బయలుదేరారు. ఆ ప్రదేశాన్ని అంగ దేశం[1] అంటారని రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు వివరించాడు.
ఆ రాత్రికి ఆ ఋషుల ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని మర్నాడు బయలుదేరారు. గంగానదిని కూడా దాటారు. దాటుతూనే ఒక భయంకరమైన అడవిలోకి అడుగు పెట్టారు. చాలా పెద్ద చెట్లు ఒక దానికొకటి రాసుకుంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. అడవి జంతువులు ఘోరంగా అరుస్తున్నాయి, అక్కడి వాతావరణమంతా భయం పుట్టేట్టు గా వుంది. ఇంకా కొంచెం దూరములో పూర్తిగా పాడుబడ్డ, మనుషులు ఎవ్వరూ లేని ఊర్లు కనబడ్డాయి. అక్కడ ఏదో తెలియని అలజడిగా ఉంది.
రాముడు విశ్వామిత్రుని తో "స్వామీ ఏమిటీ ఈ ప్రదేశము ఇంత భయంకరముగా, ప్రతికూలశక్తి వున్నట్టుగా వుంది ఎందుకు?" అని అడిగాడు.
అప్పుడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో చెప్పాడు
"ఇది తాటకారణ్యము"
"చాలా రోజుల క్రితం ఇక్కడ మలద, కరూశ[2] మనే ఊళ్ళు జనాలతో కళకళలాడుతూ ఉండేవి. ఇక్కడ తాటక[3] అనే వెయ్యి ఏనుగుల బలమున్న రాక్షసి దాని అతి భయంకరమైన, క్రూరమైన మారీచుడనే కొడుకుతో కలసి ఈ రెండు ఊర్ల మీదపడి అందరిని తిని ఈ ఊర్లను స్మశానాలుగా చేసింది. రామా నువ్వు ఇప్పుడు ఆ రాకాసిని చంపాలి" అని చెప్పాడు.
రాముడు సరే మా తండ్రి గారి అనుజ్ఞ మరియు మీ ఆజ్ఞతో తప్పకుండా చేస్తానని తన ధనుస్సు ఎత్తి పట్టుకుని వింటి నారిని లాగి వదిలాడు. అప్పుడు పుట్టిన చప్పుడు విని అడవిలో మృగాలన్నీ చెల్లాచెదురుగా పరుగులు పెట్టాయి. ఒక్కసారే కొన్ని వేల పిడుగులు పడ్డాయా అన్నంత శబ్దం అయింది.
ఆ ధ్వని ఆగుతూనే ధన్, ధన్ అని భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ, అరుస్తూ తాటక వచ్చి రామలక్ష్మణుల మీద పడింది. విశ్వామిత్రుడు హుంకారం చేస్తూ దాన్ని అడ్డగించి, రామా ‘నీకు శుభమగుగాక, ఇది ఆడది అని చూడకు’ దీన్ని వెంటనే చంపెయ్యి అని ఆజ్ఞాపించాడు. రాముడు దాని రెండుచేతులనూ బాణాలతో నరికేశాడు. లక్ష్మణుడు దాని మీదకు దూకి ముక్కు చెవులు కోసేశాడు, భయపడి వెళ్లిపోతుందేమో అని. అయినా అది మాయతో రాళ్లు, దుమ్ము వాన కురిపిస్తోంది. రాముడు ఇక లాభం లేదు అనుకొని మరో బాణాన్ని తాటక గుండెలోకి కొట్టాడు. దాంతో అది చచ్చి పడిపోయింది.
రామలక్ష్మణుల సౌర్య పరాక్రమాలకు ఇంద్రుడు దేవతలు వచ్చి మాములు బాణాలతోనే ఇంతటి బలమైన రాక్షసిని చంపాడు. విశ్వామిత్రా రాముడు నీకు
సరి అయిన శిష్యుడు, నీ దగ్గరున్న అస్త్ర సంపదంతా శ్రీ రామునికి అంద చేయమన్నారు.
దివ్యాస్త్ర సంపద
తనేమనుకున్నాడో దేవేంద్రాదులు కూడా అదే చెప్పారు. రాముణ్ణి పిలిచి అన్ని అస్త్రాలను అందించాలని నిశ్చయించాడు.
విష్ణు చక్రము వంటి అన్ని రకాల చక్రాలనూ, మోదకము వంటి గదా ప్రయోగాలను, శివ శూలము, బ్రహ్మ శిరోనామకము, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, వరుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, భాస్కరాస్త్రము, మానవాస్త్రము మోహనాస్త్రము మొదలైన అన్ని రకములైన అస్త్రాలను ప్రయోగ, ఉపసంహర విద్యలను అన్నింటిని రామునకు విశ్వామిత్రుడు నేర్పాడు. రాముడు లక్ష్మణునకు అంద చేశాడు. అస్త్రాది దేవతలంతా రాముని ముందు ప్రత్యక్షమై "స్వామీ మీ ఆజ్ఞ అనుసరించి మీరు స్మరించిన వెంటనే మీ సంకల్పాన్ని నెర వేరుస్తామని" మాట ఇచ్చి అదృశ్యమయ్యారు.
సిద్ధాశ్రమము
అక్కడినుండి రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు ఎంతో దట్టమైన అడవిలోకి వచ్చారు. అక్కడంతా చక్కటి పూల వాసనలు, అద్భుతమైన పళ్ళ చెట్లూ, పక్షుల కిలకిలారవాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. క్రూరమృగాలు, సాధు జంతువులూ కలసి తిరుగుతున్నాయి.
విశ్వామిత్రుడు రామునితో "నాయనా ఇదే సిద్ధాశ్రమం[4]. ఇక్కడ పూర్వం శ్రీ మహా విష్ణువు తపస్సు చేసాడు. ఈ సిద్ధాశ్రమంలో కశ్యప ప్రజాపతి కే శ్రీ మహావిష్ణువు వామనుడిగా జన్మించి బలిని జయించాడు. ఇక్కడే కశ్యప ప్రజాపతి సిద్ధి పొందాడు "
"అందుకే దీన్ని సిద్ధాశ్రమము అంటారు”
ఇక్కడ చేసే తపస్సు కొన్ని వేల రెట్ల ఫలితాన్నిస్తుంది. అందుకే నేను ఇక్కడ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాను. నువ్వు సర్వసన్నద్దుడవై ఈ యాగాన్ని సంరక్షించు." అని యజ్ఞాన్ని పూర్తి చెయ్యడానికి కంకణ బద్ధుడైనాడు.
యాగ సంరక్షణం
విశ్వామిత్రుడు యాగ నియమాన్ని అనుసరించి మౌన వ్రతములో వున్నాడు. ఆ రోజు సూర్యోదయానికి ముందే కాలకృత్య, సంధ్యాది విధులను పూర్తిచేసుకున్న రామ లక్ష్మణులు ఆశ్రమంలోని ఋషుల వద్దకు వెళ్లి వినయ పూర్వకంగా "రాక్షసులు ఎప్పుడు రావచ్చు చెప్పండి, మేము యాగ సంరక్షణను నిర్విఘ్నంగా పూర్తి చేస్తాము" అని అడిగారు.
దానికి ఋషులు “నేటినుండి ఆరు రాత్రులపాటు జాగ్రత్తగా ఉండమని” చెప్పి వారి పనిలో వారు నిమగ్నమైనారు.
ఆరు రోజులు గడిచాయి. ఆరవరోజు రాత్రి ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్మున్నట్టుగా తాటక కొడుకు మారీచుడు, సుబాహువు ఇంకా వేలాది రాక్షసులతో గుంపుగా వచ్చి యజ్ఞవేదికపైకి రక్త మాంసాలు గుమ్మరించారు. యజ్ఞవేదిక అంతా రక్తమయమై ఎర్రగా మెరుస్తోంది. రాముడు లక్ష్మణునితో తమ్ముడూ ఈ రాక్షసుల పని పడదామని చెప్పి మానవాస్త్రము మారీచుని మీదికి ప్రయోగించాడు. తమ్ముడూ ఈ మానవాస్త్రము దయగలది వీడిని చంపదు, బలంగా దెబ్బకొట్టి దూరంగా విసిరి వేస్తుంది అంటూ, ఆగ్నేయాస్త్రాన్ని సుబాహునికి గుండెలో నాటు కునేట్టు వేశాడు. సుబాహుడు చచ్చిపోయాడు. మారీచుడు ఎక్కడో చాలా దూరంగా పడిపోయాడు. రాక్షసులు చనిపోయిన వాళ్ళు పోగా మిగతా వాళ్ళు పారిపోయారు. ఆ విధంగా యాగం సంరక్షించాడు శ్రీ రాముడు.
మర్నాడు ఉదయం పూజాదికాలు అయిపోయిన తర్వాత రాముడు విశ్వామిత్రుని వద్దకు వచ్చి
"స్వామీ మీరు నాన్నగారిని అడిగిన కోరికను, మీ అనుగ్రహం వల్ల ఏ ఆటంకము లేకుండా సంరక్షణ చేయాలిగాము".
"మన తర్వాతి పని ఏమిటి?" అని అడిగాడు.
అప్పటికే విశ్వామిత్రుడు రాముని గురించి ఆలోచిస్తూ ఈ యాగాన్ని ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చేయటానికి రాముడు ఎంతో సహాయం చేసాడు, మరి చేసిన సహాయానికి నేనుకూడా ఆయనకు ఏదయినా మంచి చెయ్యాలి కదా అని అనుకున్నాడు.
అప్పుడు విశ్వామిత్రునితో ఉన్న మునులు "రామా మిథిలా నగరంలో జనక మహారాజు యజ్ఞం నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్లాలని బయలుదేరుతున్నారు. మీరు తోడుగా వెళ్ళండి" అన్నారు.
"మరి జనక మహారాజుగారు మనలను పిలవలేదుగా" అన్నాడు రాముడు.
"యజ్ఞ, యాగాలకు ఎవరైనా వెళ్ళవచ్చు పిలవ వలసిన పని లేదు" అన్నారు మునులు.
దారిలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తన కుటుంబ చరిత్ర[5], కుమారస్వామి జననం[6], గంగావతరణం[7] చెప్పాడు. అలా రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలసి మధ్యలో విశాల నగరం[8]లో మహారాజు సుమతి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ రాత్రి అక్కడ గడిపి మరునాడు ఉదయాన్నే మిథిలా నగరానికి బయలుదేరారు.
అహల్యా శాపవిమోచనం
కొన్ని రోజులు నడచిన ముగ్గురూ మిథిల దగ్గరకు చేరారు.
మిథిలానగరానికి దగ్గరలో ఒక ఆశ్రమాన్ని చూసాడు రాముడు. చాలా చక్కగా వున్నది ఆశ్రమం కానీ ఆ ఆశ్రమంలో ఒక్క మనిషీ కనపడలేదు. అంతా దుమ్ము పేరుకొని వుంది.
అదే సందేహంతో రాముడు విశ్వామిత్రుని "మహాత్మా ఈ ఆశ్రమము చాలా అందంగా అద్భుతంగా వుంది, కానీ మనుషులెవ్వరూ కనపడటం లేదు ఎందుకు?" అని అడిగాడు.
"రామా ఇది గౌతమ మహర్షి ఆశ్రమం, లోపలి వెళదాం" అని అన్నదమ్ములతో ఆశ్రమంలోకి అడుగు పెట్టాడు విశ్వామిత్రుడు.
రామచంద్రమూర్తి ఆ ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే ఒక అద్భుతం జరిగింది. అప్పటివరకు ఎవరికీ కనపడని ఓ అందమైన సుకుమారమైన, లావణ్యమైన స్త్రీ అక్కడ పడివున్న దుమ్ములోంచి పైకి లేచి వీరికి కనబడింది. రామచంద్రమూర్తి వెంటనే వంగి ఆమె పాదాలకు నమస్కరించాడు. తమ్ముడు లక్ష్మణుడు కూడా అన్నను అనుసరించాడు.
అప్పుడే గౌతమ మహర్షి కూడా అక్కడికి వచ్చి, వీరిని కుశల ప్రశ్నలు అడిగి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి వీరిని సంతోష పెట్టాడు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులను గౌతమ మహర్షికి పరిచయం చేసాడు. గౌతమ మహర్షి, అహల్య రామలక్ష్మణులను "కళ్యాణమస్తు" అని దీవించారు.
అక్కడినుంచి బయలు దేరిన తర్వాత గౌతమ మహర్షి, అహల్యల కథ[9]ను రామునికి వివరించాడు విశ్వామిత్రుడు.
మిథిలా నగర ప్రవేశము
ముగ్గురూ మిథిలా నగరంలోకి ప్రవేశించి, అంతఃపురంలో ఉన్న జనక మహారాజుకు తమ రాకను తెలియజేయమని అక్కడి కాపలా వారికి చెప్పాడు మహర్షి విశ్వామిత్రుడు.
జనక మహారాజు, తమ పురోహితుడు శతానందునితో కలసి వచ్చి వీరిని లోపలి తీసుకెళ్లి అతిధి మర్యాదలు చేశారు.
శతానందుడు, గౌతమ అహల్యల కుమారుడు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణుల గురించి జనక మహారాజుకు, శతానందునకు చెప్తూ
“వీరు రామ లక్ష్మణులు. అన్నదమ్ములు. దశరథ రాజకుమారులు” అని పరిచయము చేసాడు.
దశరథ రాజ కుమారుడు రాముని పేరు వినగానే శతానందుడు దారిలో మా ఆశ్రమానికి వెళ్ళారా? మా తల్లి తండ్రులను కలిసారా? అని అడిగాడు.
విశ్వామిత్రుడు అవునని తలవూపుతూ జరగవలసిన మంచి జరిగింది అని చెప్పాడు.
అప్పుడు శతానందుడు రామ లక్ష్మణులకు ఒక రాజుగా వున్న విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడో వివరించాడు[10].
శివ ధనుర్భంగము
జనకుడు యాగము గురించి చెప్తూ
"పన్నెండురోజుల నుండి యాగము చేస్తున్నాను.
ఈ రోజు మా అదృష్టము మీరు
వచ్చారు. మా అమ్మాయి సీతకు పెళ్లి చేయాలని
నిశ్చయించాను.
అయితే ఆమె మామూలు మానవ కాంత
కాదు. యజ్ఞము చేద్దామని భూమిని దున్నుతుంటే భూమిలోంచి పుట్టింది. ఆమె ను నా కుమార్తెగా
భావించి పెంచుకుంటున్నాను.
పెండ్లి వయసు వచ్చాక ఆమెను
పెండ్లి చేసుకునేవాడు కూడా ఎంతో శక్తివంతుడై వుండాలని భావించి మా పూజా మందిరంలో గత కొన్ని తరాలుగా పూజలందుకుంటున్న అతి శక్తివంతమైన
శివ ధనస్సును ఎక్కుపెట్టినవాడికే నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తానని ప్రకటించాను.
ఆ తర్వాత మా అమ్మాయి అందం
గురించి విని ఎందరో రాజులు వచ్చారు, కానీ శివధనస్సు ఎక్కుపెట్టటము కాదు కదా కనీసం దాన్ని
ఎత్తలేక పోయారు.
దాంతో వారు దానిని అవమానముగా
భావించి మా రాజ్యము మీదికి యుద్ధానికి వచ్చారు. నేను భగవంతుని అనుగ్రహంతో వారినందరిని
ఓడించాను.
కానీ మా అమ్మాయికి సరైన
వరుడు ఇంకా దొరకలేదు" అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు
"ఏదీ ఆ వింటిని చూపించు మహరాజా" అని అడిగాడు.
జనకుని ఆజ్ఞతో ఐదువేలమంది
ఎనిమిది చక్రాలమీద ఉంచిన ఒక పెట్టెలో అతి పెద్ద ధనువును తీసుకొని వచ్చారు.
విశ్వామిత్రుడు ఆ ధనువును
చూస్తూ "నాయనా రామచంద్రా నువ్వు కూడా ఒక్క సారి చూడు" అన్నాడు.
రాముడు ఆ పెట్టెలోని విల్లును
చూస్తూ విశ్వామిత్రునితో "గురువుగారూ ఒక్క సారి తాకి చూడనా" అని అడిగాడు.
అలాగే అన్నాడు గురువు.
మళ్ళీ "గురువర్యా మీరు
అనుమతిస్తే దీన్ని బయటకు తీసి ఎక్కు పెట్టాలనుకుంటున్నాను" అన్నాడు.
అలాగే నాయనా అన్నాడు విశ్వామిత్రుడు.
వెంటనే రాముడు ఆవింటిని
లక్ష్యమే లేనట్టు మామూలుగా ఎండిన కట్టెను ఎత్తినట్టు ఒక్కసారిగా లేపి ఎక్కుపెట్టటానికి
వింటి నారిని సంధిచే ప్రయత్నం చేశాడు.
అంతే మహా అద్భుతం జరిగింది.
ఎవ్వరూ కనీ, విననిది జరిగింది. కొన్ని వేల పిడిగులు పడ్డట్టు అక్కడ, అప్పుడు పుట్టిన
శబ్దానికి భూనభోంతరాలు దద్దరిల్లాయి. భూకంపం వచ్చినట్టు, పర్వతాలు చీలిపోతున్నట్టు
చాలాసేపు భూమి వణికిపోయింది.
విశ్వామిత్రుడు, రాముడు,
లక్ష్మణుడు, జనకుడు తప్ప అందరూ మూర్ఛపోయారు.
ఆ విల్లు రెండుముక్కలుగా
విరిగి పోయింది.
జనకుడు ఆనందముతో మనుష్యులు,
దేవతలు, రాక్షసులు, కిన్నెరులు, గంధర్వులలో ఇంతవరకూ ఎవ్వరూ కనీసం ఈ వింటిని ఎత్తలేకపోయారు.
ఆహా ఆహా ఏమి ఆ భుజ బలము.
కన్నార్పకుండా చూసాను. ఎంత ఆశ్చర్యము.
సీతకు పెండ్లికొడుకు దొరకడేమో
అని భయపడి పోతున్నాను.
ఇక సీత రాముని భార్య, విశ్వామిత్ర
మహర్షీ ఇప్పుడే నా కూతురు సీతను రామచంద్రునికి ఇచ్చి పెండ్లి చేస్తాను అన్నాడు.
నా బాధ తీర్చావు రామచంద్రా.
నా ప్రతిజ్ఞ ప్రకారము సీతను ఇచ్చి నీకు ఇప్పుడే పెండ్లి చేస్తాను అని అన్నాడు.
జనకుని మాటలు విన్న రాముడు
నవ్వుతూ సీతను పెండ్లి చేసుకొనుటకు ఒప్పుకోలేదు.
మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారము
విశ్వామిత్రులు ఏమిచేయమంటే అది చేశాను.
వింటిని చూడమన్నారు, చూశాను.
ఎక్కు పెట్టమన్నారు, ఎక్కు
పెట్టాను.
దానిలో శక్తి లేకపోవటంతో
విరిగిపోయింది. అంతే.
పెళ్లి చేసుకోవడానికి నా
తండ్రి అనుమతి లేదు.
ఆ విషయము నా తండ్రిగారికి
మాత్రమే సంబంధించినది. నాకు సంబంధించినది కాదు.
ఆయన ఎవరిని చేసుకోమంటే ఆమెనే
నా ధర్మపత్ని అని పెళ్లి వద్దన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు,
జనక మహరాజా "రాముడు ధర్మమే చెపుతున్నాడు. దశరథునికి ఈవిషయము తెలియచేసి రమ్మని
ఆహ్వానము పంపు" అన్నాడు.
వెంటనే జనకుడు దూతల ద్వారా
జరిగిన విషయాలన్నీ తెలియచేస్తూ పెళ్ళికి తరలి రమ్మని ఒక ఆహ్వాన లేఖ పంపాడు.
దూతలు అయోధ్య చేరి దశరథునకు
ఆ విషయాలు వివరించి, జనకుడు రాసిన లేఖను అందించారు.
శ్రీ సీతారామ కళ్యాణం
దశరథుడు ఆనందంతో భరత, శత్రఘ్నులతోను,
మంత్రులతోనూ, పురోహితులతోనూ మాట్లాడి రామ కళ్యాణానికి కావలసిన పూర్తిచేయమన్నాడు.
మరునాడు ఉదయాన్నే అయోధ్యనుండి
వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, మార్కండేయుడు కాత్యాయనుడు మొదలయిన ఋషులతో,
మంత్రులు, పురోహితులు, భరత, శత్రఘ్నులతో, బంధువులతో కలసి ఐదు రోజులు ప్రయాణము చేసి
మిథిలా నగరానికి చేరుకున్నారు.
జనకమహారాజు ఎంతో ఆనందంతో
వాళ్ళందరినీ ఆహ్వానించి నా అదృష్టముచేత ఇంతమంది మహానుభావులను చూడగలిగాను. మీ కుమారుడు
రామచంద్రుడు స్వయంవర నియమప్రకారం శివధనువును ఎక్కుపెట్టాడు అతని బలము వలన అది విరిగిపోయినది.
నా కుమార్తె సీతను రామచంద్రునకు ఇచ్చి కళ్యాణము చేయడము నాకు ఎంతో పుణ్యమును కలుగచేస్తుంది.
అని దశరథునికి అయన పరివారానికి అన్ని సౌకర్యాలతో విడిది ఏర్పాటు చేయాడు.
జనకుడు సాంకాశ్య రాజైన తన
తమ్ముడు కుశధ్వజుడిని పిలిపించాడు.
తరువాతి రోజు జనకుడు, దశరథునితోను
అక్కడవున్న ఋషులతోను సీతారామ కల్యాణ విషయాలు మాట్లాడుతూ, నా ఇంకో కుమార్తె ఊర్మిళను
లక్ష్మణునకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు అయిన మాండవిని భరతునకు, శృతకీర్తిని
శత్రఘ్నునకు ఇచ్చి వివాహము చేయడానికి నిశ్చయించారు.
ఋషులు, పురోహితులు నేటికి మూడవ రోజు కళ్యాణము చేయటానికి నిశ్చయించారు.
ఆ రోజు సీతా రాములకు, ఊర్మిళ
లక్ష్మణులకు, మాండవి భరతులకు, శ్రుతకీర్తి శత్రఘ్నులకు అత్యంత వైభవంగా వివాహములు జరిపించారు.
ఆ వివాహంతో ఆనందించిన దేవతలు ఆకాశం నుంచి పూలవాన కురిపించారు. మేళతాళాలు మోగించారు.
నాట్యాలు చేసారు.
అందరూ ఆనందంలో మునిగి తేలారు.
ఇంత చేసిన విశ్వామిత్ర మహర్షి తను చేయవలసిన
పని అయిపోయింది అని సీతారాములను ఆశీర్వదించి
హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
పరశురాముని రాక - రాముని గెలుపు
కొడుకులు కోడళ్లతో దశరథ
మహారాజు అయోధ్యకు బయలుదేరాడు. ఇంతలో హోరు గాలి వీచింది. చీకట్లు కమ్మాయి. ఆ చీకట్లలోంచి
జటాజూటాలతో భుజాన గండ్రగొడ్డలి తగిలించుకొని
భయంకరమైన ధనువును చేతిలో పట్టుకుని విపరీతమైన కోపంతో పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. పరశురాముని చూడటంతోనే దశరథుని తో ఉన్నవారంతా తెలివితప్పి
పోయారు.
పరశురాముడు విష్ణుమూర్తి
అంశావతారము. తన తండ్రి జమదగ్నిని కొంతమంది రాజులు చంపారని పగబట్టి ఇరవైయొక్క సార్లు
ఈ ప్రపంచములోని రాజులందరినీ చంపినవాడు. తన తల్లి రేణుక రామునికి చెందిన ఇక్ష్వాకువంశమునకు
చెందినది అయినందువల్ల అయోధ్య రాజులను వదిలివేశాడని అంటారు.
పరశురాముని చూసి దశరథుడు
ఆందోళనతో స్వామీ నా కొడుకులను ఏమీ చేయకు అంటూ వేడుకున్నాడు. అయినా పరశురాముడు రాముడిని
చూస్తూ..
రామా! దశరథ రామా! నీవు శివ
ధనుస్సు విరిచావుట. అంత గొప్పవాడివా? శివ ధనుస్సు, విష్ణు ధనస్సును రెండూ అతి గొప్ప
ధనువులే. దేవతలు వీటిని ప్రత్యేకంగా తయారు చేయించి త్రిపురాసుర సంహారానికి శివ ధనుస్సు
ఇచ్చారు. తరువాత అది జనకుని వద్దకు చేరింది.
ఇదిగో ఇది విష్ణుధనువు దీన్ని ఎక్కుపెట్టి నీ ధైర్యాన్ని, బలాన్ని నిరూపించుకో
అని గర్జించాడు.
శ్రీ రాముడు తండ్రి ఎదురుగా
వున్నాడని, మృదువైన గొంతుతో “పరశురామా నీ గురించి విన్నాను. వీరుడివి,
తండ్రిని చంపినవాడి మీద పగ తీర్చుకోవటం వరకు అంగీకరించవచ్చు. కానీ నన్ను చేతకాని వాడిగా
అనుకోవద్దు. ఏదీ ఆ విష్ణు చాపాన్ని ఇలా ఇవ్వు” అని రాముడు పరశురాముని చేతిలోనుంచి ఒక్క
సారిగా విష్ణు ధనువును లాక్కున్నాడు.
దానితో పాటు పరశురామునిలోని
విష్ణు తేజస్సుకూడా రాముడు తనలోకి కలిపివేసుకున్నాడు.
లాక్కున్న ధనువుకు ఒక భయంకరమైన
బాణాన్ని సంధించిన రాముడు "నీవు బ్రాహ్మణుడవు, అదీకాక నా గురువు విశ్వామిత్రుని
బంధువువు. అందుకని నిన్ను చంపలేను, ఈ ఎక్కుపెట్టిన బాణాన్ని ఏమిచెయ్యమంటావు? చెప్పు
అన్నాడు"
అప్పటికి పరశురాముడు బలమంతా
పోగొట్టుకున్నవాడై, తేజము లేకుండా అయినాడు. రాముడు శ్రీ మహావిష్ణువు అవతారమని, రావణ
సంహారానికి అవతరించాడని గ్రహించి "రామచంద్రా నిన్ను సాధారణ రాజకుమారుడు అని అనుకున్నాను.
కానీ నువ్వు శ్రీమన్నారాయణుడవు అని తెలుసుకున్నాను. నన్ను క్షమించు, నా తపోలోకాలను ఆ బాణంతో దహించివేయి.
నేను మహేంద్రగిరికి తపస్సుకు వెళ్ళిపోతాను"
అని వేడుకున్నాడు.
రాముడు ఆ బాణంతో పరశురాముని
తపోలోకాలను ధ్వంసం చేశాడు. ఈ సంఘటనను చూడటానికి వచ్చిన దేవతలలో వరుణుడికి అవసరమైనప్పుడు
తీసుకుంటాను అని విష్ణు చాపాన్ని ఇచ్చి వేశాడు రాముడు. అప్పటికి పరశురామ భయంతో తెలివితప్పి
పడివున్న దశరథునితో సహా పరివారాన్ని లేపి అయోధ్యకు ప్రయాణమయ్యారు.
సీతారామ సుఖ జీవనము.
కొడుకులు కోడళ్లతో అయోధ్యకు
చేరుకున్న దశరథునికి ప్రజలంతా పూలవర్షంతో ఆహ్వానించారు. అయోధ్యానగరమంతా అందంగా అలంకరించారు.
ప్రజలంతా సీతారాములను చూసి మురిసిపోయారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కోడళ్లను ఆశీర్వదించి
ఆహ్వానించారు.
తన తండ్రి సీతను మెచ్చి
తనకిచ్చి పెండ్లి చేశాడని రామునికి సీత అంటే చాలా ఇష్టము. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలా
సౌభాగ్యంతో, అందంతో, సుకుమారంతో ఉన్న తన భార్యను ప్రాణసమానంగా, ప్రేమగా చూసుకుంటున్నాడు
రాముడు.
ఆవిధంగా సుఖ సౌఖ్యాలతో సీతారాములు
పన్నెండు సంవత్సరాలపాటు ఆనందంగా వున్నారు.
-బాలకాండ సమాప్తం-
బాలకాండలో - ఇతర కథలు
అంగ దేశం
పూర్వం దేవతాకార్య నిమిత్తం శివపార్వతుల కళ్యాణం జరగాలని, దాన్ని సాధించడానికి, మన్మథుడిని ప్రేరేపించారు.
శివుడు తపస్సులో ఉన్నాడు. పార్వతీదేవి శివుడిని
సేవించుకుంటోంది.
ఆ సమయంలో మన్మధుడు శివపార్వతుల మధ్య ప్రేమ కలగాలని తన పూల
బాణాలను శివుని మీద వేశాడు. శివునికి తపోభంగమై మనసు చలించింది.
శివుడు కళ్లుతెరిచి మన్మథుని చూసి విపరీతమైన కోపంతో మూడోకన్ను
తెరిచాడు. దానినుంచి వచ్చిన అగ్ని జ్వాలలో మన్మథుడు కాలిపోయాడు.
ఆ సమయంలో మన్మథుని అంగాలన్నీ, అంటే శరీరభాగాలు అగ్నిజ్వాల వేడికి అక్కడ కాలిపడిపోయాయి.
అంగాలు పడిన ప్రదేశం కాబట్టి దీన్ని అంగదేశం అన్నారు.
మలద, కరూశక కథ
పూర్వం ఇంద్రుడు, వృత్రాసురునితో యుద్ధంలో మోసం చేసి ఆ వృత్తాసురుని చంపిన
కారణంగా బ్రహ్మహత్యా దోషం వచ్చింది. దానివల్ల ఇంద్రునికి మలదం, కరూశము అనే సమస్య వచ్చింది. దానివల్ల ఇంద్రునికి విపరీతమైన ఆకలి, విరేచనం అతిగా అవుతూవుండేవి. ఆ బాధను భరించలేని ఇంద్రుడు
అన్నిలోకాలను తిరుగుతూ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ సమస్య తీరింది.
అందుకని ఆ ప్రదేశాన్ని మలద, కరూశములు అన్నారు. అక్కడ జనసమాచారం పెరిగి రెండు గ్రామాలుగా
ఏర్పడ్డాయి. అది ఈప్రదేశం కథ.
తాటక వృత్తాంతం
తాటక సుకేతుడనే యక్షుని కూతురు. బ్రహ్మ వరముతో వెయ్యి ఏనుగుల
బలంతో పుట్టింది. చాలా అందంగా కూడా ఉండేది. పెళ్లి వయసు వచ్చాక తాటకను సుందుడు అనే
వాడికిచ్చి పెళ్లి చేశారు. వాళ్లకు అతి బలవంతుడైన మారీచుడు కొడుకుగా పుట్టాడు.
బల గర్వంతో జనాలను ఇబ్బందిపెట్టి చంపేవారు. మారీచుడు మనుషులను
తినేసేవాడు. ఒకసారి సుందుడు అగస్త్యమహర్షి మీద దాడి చేసినప్పుడు ఆయన వాడిని
చంపివేశాడు.
దానితో తాటక అగస్త్యుని చంపాలని ఆయన మీదకు వెళ్ళింది. దానితో
అయన దాన్ని నువ్వు ఈ అందమైన రూపము వదిలి భయంకర ఆకారంలో నరమాంస భక్షకివి అవుతావని
శపించాడు.
అప్పటినుంచి తాటక తన కొడుకు మారీచునితో కలసి అక్కడి ఊళ్ళ మీదపడి
జనాలను చంపి తినేవాళ్లు. దానితో మలద కరూశలు జన సంచారము లేక పాడుపడిపోయాయి.
సిద్ధాశ్రమం
సిద్ధాశ్రమంలో విష్ణు మూర్తి చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు.
ఈ ఆశ్రమంలోనే కశ్యపుడు
విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి, శ్రీహరి ప్రత్యక్షమయిన తర్వాత ఆయననే తనకు, అదితికి
కొడుకుగా పుట్టి దేవతల కష్టాలు తీర్చమని అడిగాడు. దానికి మహా విష్ణువు సరే
అన్నాడు.
అంతకు ముందు బలి చక్రవర్తి వల్ల దేవేంద్రుడు స్వర్గలోకం నుంచి
తరిమివేయబడ్డాడు.
దేవతలంతా నానా బాధలు పడుతున్నారు. ఈ సమయంలో కశ్యపునికి శ్రీమహా
విష్ణువు వామనునిగా జన్మించాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేసే సమయంలో వామనుడు బలి
నుండి రెండు అడుగుల నేలను దానము తీసుకొని
త్రివిక్రమ అవతారంతో అన్ని లోకాలను ఆక్రమించి బలిని పాతాళానికి తొక్కి వేశాడు.
దేవతలకు తిరిగి స్వర్గాధిపత్యం దొరికింది.
కశ్యప ప్రజాపతి ఈ ఆశ్రమంలోనే సిద్ధి పొందాడు. అందుకే దీన్ని
సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడ చేసే పుణ్యకార్యం ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అయి మంచి
ఫలితాలను ఇస్తుంది. అందుకే విశ్వామిత్రుడు కూడా ఇక్కడే యాగం చేశాడు.
విశ్వామిత్ర వంశక్రమం
పూర్వం బ్రహ్మ, కుశుడు
అనే అతనిని సృష్టించి భూమి మీద ధర్మ రక్షణకు రాజ వంశాభివృద్ధి చేయమని పంపాడు. అంటే అప్పటికి అతనికి రాజ్యము లేదు.
అయన విదర్భ రాజు కూతురును భార్యగా చేసుకున్నాడు.
వారిద్దరు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు అనే నలుగురు మగ
పిల్లలను కన్నారు.
పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత ఒక ఆ నలుగురు పిల్లలను కుశుడు
పిలిచి "మీకు మంచివి అనిపించిన ప్రదేశాలను అభివృద్ధి చేసి జనాలు చెడిపోకుండా, వాళ్ళను ప్రేమతో పరాక్రమంతో పరిపాలించండి" అన్నాడు.
కుశాంబుడు కౌశాంబి అనే నగరాన్ని కట్టించాడు.
కుశనాభుడు మహోదయం అనే నగరాన్ని ఏలాడు.
అధూర్తరజసుడు ధర్మారణ్యము
అనే ప్రదేశానికి రాజయ్యాడు.
వసువు గిరివ్రజపురము ను రాజధానిగా చేసుకున్నాడు.
ఇందులో కుశనాభుడు ఘృతాచి అనే ఆమెను పెళ్లి చేసుకొని నూరు మంది
అద్భుత సౌందర్యరాసులైన ఆడపిల్లలను
కన్నారు. ఈ నూరుమంది పెళ్లి వయసుకు వచ్చేసరికి మహా తేజోవంతులై అందంతో
వెలిగిపోతున్నారు.
ఒకనాడు వాయుదేవుడు వీళ్ళను చూసి “మిమ్మల్ని ఇక్కడే గాంధర్వ విధిన నేను
పెళ్ళి చేసుకుంటాను. మీకు దేవతల వలె శాశ్వత దైవత్వము ఇస్తాను” అన్నాడు.
దానికి ఆ వందమంది కూడా మా పెళ్లి విషయం మా తండ్రి గారు
నిర్ణయించాలి, మేము నిర్ణయం తీసుకోము.
నిన్ను పెళ్లి చేసుకోము అని చెప్పారు.
దాంతో వాయుదేవునికి కోపం వచ్చి వాళ్లందరిలో వాయువును బంధించి
బిగించి వేశాడు .
దాంతో వాళ్ళందరూ వంకరలు తిరిగి అందవిహీనంగా అయిపోయారు. ఆ
పిల్లందరూ తండ్రికి వాయుదేవుడు ఇలా చేసాడని తండ్రికి చెప్పుకొని బాధపడ్డారు.
వాయుదేవుడు ఒక ప్రముఖ దేవతలోనివాడు అని ఓర్పుతో శాపము ఇయ్యలేదు. అన్నారు.
ఆ మాటలకు తండ్రి కుశనాభుడు ఓరిమి అన్ని వేళలా మంచిదే మీకు శుభం
జరుగుతుంది. భయపడకండి అన్నాడు.
కాంపిల్య రాజు బ్రహ్మదత్తుడు చాలా మంచివాడు, గొప్పవాడని తెలిసి అతనికి తన కుమార్తెల విషయము చెప్పి పెళ్లి
చేసుకోమన్నాడు కుశనాభుడు.
దానికి సరేనని బ్రహ్మదత్తుడు ఆ వందమంది ఆడపిల్లలను పెళ్లి
చేసుకున్నాడు. పెళ్ళిలో బ్రహ్మదత్తుడు వారిని తాకగానే వారికి వాళ్ళ అందమైన రూపాలు
తిరిగి వచ్చాయి. బ్రహ్మదత్తుడు భార్యలతో కాంపిల్య నగరానికి వెళ్ళాడు.
అప్పటి వరకు పిల్లలతో కళకళలాడిన ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దం
అయిపోయే సరికి పిల్లల కోసం బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రాహ్మ వారంతో గాధి అనే
మగ పిల్లవాడిని కన్నాడు. ఆయన గొప్ప రాజుగా ధర్మబద్ధంగా రాజ్యము ఏలాడు. ఆయనే
నాతండ్రి అంటూ విశ్వామిత్రుడు రామునికి తన వంశము గురించి తెలిపాడు. కుశుని
వంశానికి సంబందించినవాడిని కాబట్టి నన్ను కౌశికుడు అంటారు. అని చెప్పాడు.
కుమారస్వామి జననం
శివ పార్వతుల కళ్యాణం తర్వాత ఎంత కాలానికీ వాళ్లకు పిల్లలు
పుట్టలేదు. శివపార్వతుల సంయోగంలో శివుడు రేతస్సును విడువలేదు. అలానూరు సంవత్సరాలు
గడిచాయి. ఇన్ని సంవత్సరాల సంయోగం వల్ల శివపార్వతులకు పుడితే ఎంత శక్తివంతుడు అవుతాడోనని దేవతలు
భయపడి బ్రహ్మకు మొర పెట్టుకుంటే, బ్రహ్మ
శివునికి విన్నవించమన్నాడు. దేవతలంతా శివుని వద్దకు వెళ్లి మేము మీ తేజోబలంతో
పుట్టే వాడంటే భయపడుతున్నాము. మీ తేజాన్ని పార్వతీలోకి విడువ వద్దు అని వారి
భయాన్ని తెలిపారు. శివుడు భక్త సులభుడు కాబట్టి తన తేజస్సును భూదేవి సరే అన్నదని భూమి పై విడిచి పెట్టాడు.
ఈ విషయం తెలిసిన పార్వతి కోపంతో రగిలిపోయి నాకు సంతాన ప్రాప్తి
లేకుండా చేసినందుకు దేవతలందరకు పిల్లలు పుట్టరని శపించింది. భూ దేవి ని కూడా
నువ్వు నా భర్త తేజస్సును తీసుకున్నావు కాబట్టి నీకు అంతు లేనంతమంది భర్తలౌతారు.
అని శపించింది.
శివ తేజశ్శక్తిని తట్టుకో లేని భూమి గగ్గోలు పెట్టింది. ఈసారి
శివ తేజస్సును అగ్నిదేవునికి ఇచ్చి కాపాడమన్నారు. ఆయన దాన్ని తన దగ్గరే జాగ్రత్తగా
దాచి ఉంచాడు.
కొంత కాలము తరువాత బ్రహ్మదేవుని తారకాసురుడు శివ పుత్రుని
చేతిలో మాత్రమే మరణించేట్టుగా వరం కోరుకుంటాడు. ఈ విషయం తెలిసిన దేవతలు గంగా
దేవిని ప్రసన్నం చేసుకొని అగ్నిదేవుని వద్ద వున్న శివుని తేజస్సును ఆమెలోకి
ప్రవేశపెట్టారు. ఆమె కూడా తట్టుకోలేక ఆ పిండాన్ని గంగ ఒడ్డున వున్న ఒక రెల్లు పొదలలో విడిచి పెట్టింది.
ఆ రెల్లు పొదలలో ఒక అందమైన పిల్లవాడు విపరీతమైన బలసంపన్నుడు
ఉద్భవించాడు. ఆయన రెల్లు పొదలో పుట్టాడు
కాబట్టి శరవణుడని, ఆరుగురు
కృత్తికల దగ్గర ఆరు ముఖాలతో పాలు తాగాడు
కాబట్టి కార్తికేయుడని, శివ
కుమారుడు కాబట్టి కుమారస్వామి అంటారు.
ఈ కథను చదివిన, విన్న
వాళ్లకు కుమారస్వామి అనుగ్రహంతో అన్ని శుభాలు కలుగుతాయి.
గంగావతరణం
ఇక్ష్వాకు వంశంలో రామచంద్రుని పూర్వీకులలో సగరుడు అనే
ఒకరాజున్నాడు.
ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని. విదర్భ రాజు
కూతురు. చిన్న భార్య అరిష్టనేమి కుమార్తె సుమతి.
పెద్దభార్యకు ఒక కొడుకు పేరు అసమంజసుడు. రెండవ భార్యకు కొడుకులు
అరవై వేలమంది.
అసమంజసుడు క్రూరుడు. రాజ్యంలో వాళ్ళను సరయు నదిలోకి తోసి వాళ్ళు
ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంటే ఆనందించేవాడు. ఇతనికి పెండ్లి అయి అంశుమంతుడుని
కన్నాడు. అయినా తన క్రూరత్వం తగ్గకపోవడంతో సగరుడు అతనిని రాజ్యం నుంచి
వెళ్ళగొట్టాడు.
ఒక సారి సగరుడు అశ్వమేథయాగాన్ని చేస్తున్నప్పుడు, ఇంద్రుడు గుర్రాన్ని మాయం చేస్తాడు. గుర్రం
లేనిదే యాగం ఫలించదు కాబట్టి దాని వెదికి పట్టుకు రమ్మని తన అరవైవేలమంది కుమారులకు
చెప్పాడు. ఈ అరవై వేలమంది గుర్రాన్ని వెదుకుతూ భూమినంతా తవ్వి పాతాళానికి
వెళ్లారు. అక్కడ కపిల మహర్షి దగ్గరలో ఆ గుర్రాన్ని చూసి కపిలుడే గుర్రాన్ని
దొంగిలించాడనుకొని ఆయన్ని బాగా తిట్టారు. దాంతో కోపం తెచ్చుకున్న కపిలుడు వాళ్ళను భస్మం
చేశాడు.
ఎంతకాలానికీ,
వెళ్లిన అరవై వేలమంది తిరిగి రాలేదని అంశుమంతుని వెదకడానికి పంపిస్తే అతను పాతాళానికి
వెళ్ళి జరిగిన విషయం తెలుసుకొని ఆ గుర్రాన్ని తీసుకొచ్చి యాగాన్ని పూర్తి
చేయిస్తాడు.
కానీ శాపాగ్నిలో దగ్దమైన వాళ్లకు స్వర్గలోక ప్రాప్తి కావాలంటే
స్వర్గంలో వున్న ఆకాశగంగ భూమిపై దిగి ఆ భస్మ రాసుల మీద ప్రవహించాలని అంశుమంతునికి
గరుత్మంతుడు చెప్పాడు. తన తండ్రులకు స్వర్గప్రాప్తి కలిగించడానికి గంగను
భూలోకానికి ఎలా తీసుకురావాలో తెలియకనే ఆయన ముప్ఫై రెండువేల సంవత్సరాల పాలనా జీవితం గడిచిపోతుంది.
అంశుమంతుని కొడుకు దిలీపుడు కూడా యజ్ఞ యాగాలు చేశాడు కానీ గంగను
భూమి మీదకు తెప్పించలేకపోతాడు. ఆయన కూడా వేల
సంవత్సరాల కాలం ఏమీ చేయలేక పోయాడు. ఆ తరువాత…
ఆయన కొడుకు భగీరథుడు రాజయ్యాక,
రాజ్యాన్ని మంత్రులకు విడచి తన ముత్తాతల ముక్తికై ప్రత్నించడానికి
బయలుదేరాడు. గోకర్ణం చేరి పంచాగ్నుల మధ్య చేతులు పైకెత్తి ఒక వేయి సంత్సరాలు
బ్రహ్మకై తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఆకాశగంగ భూమి పైకి ఉధృతంగా దూకితే
భూమి తట్టుకోలేక బద్దలైపోతుంది. దాన్ని భరించాలంటే శివుడు
మాత్రమే సరి అయినవాడు అని,
గంగకు భగీరథుని కోరిక మేరకు ఆమెను భూమికి వెళ్ళమని చెప్పాడు. గంగాదేవి సరే అన్నది.
అలా భగీరథుడు మళ్ళీ ఒక సంత్సరం
శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై భగీరథుని కోర్కెను
తీరుస్తానని తన జటలందు గంగను పట్టుకుంటానన్నాడు. గంగ ఆవేశంతో ఉరకలెత్తుతూ నన్ను
ఏమాత్రము భరిస్తాడో చూస్తానని గర్వంతో ఒక్క ఉదుటున ఆకాశంలోనుండి శివుని
జటాజూటంలోకి దూకింది.
గంగ గర్వాన్ని చూసి శివుడు తన జటలలోనే బందించి ఉంచాడు. ఎన్ని
రోజులకు గంగ శివుని జటాజూటము నుండి బయటకు రాకపోవడంతో భగీరథుడు మళ్ళీ శివుని
గురించి తపస్సు చేశాడు. శివుడు దయతలచి ఒక పాయను కొద్దిగా తెరవడంతో గంగ బిందు
సరోవరంలోకి మెల్లిగా దూకింది. అక్కడినుండి ఏడు
పాయలుగా ప్రవహించిన గంగలోని మూడు పాయలు తూర్పుకి హ్లాదిని, పావని, నళిన
అనే పేర్లతో, సుచక్షువు, సీత, సింధు అనే పేర్లతో మూడు పాయలు పడమరకు పారగా మిగిలిన ఒక పాయ గంగ
పేరుమీద భగీరథుని రథం వెంట వచ్చింది. గంగ
అతిశయంతో దారిలో వున్నా జహ్నుముని ఆశ్రమాన్ని ముంచి వేసింది. దానితో కోపం
తెచ్చుకున్న జహ్ను ముని గంగనంతటినీ ఒక్క గుక్కలో తాగేశాడు. భగీరథుడు మళ్ళీ ఆ
మహర్షిని ప్రార్ధిస్తే తన చెవినుంచి గంగ విడిచాడు. దాని వల్ల జాహ్నవి అనే పేరు వచ్చింది
చివరకు భగీరథుడు గంగను తన ముత్తాతలు, సగరుల భస్మరాశుల మీదుగా గంగను ప్రవహింప చేసి వారికి ముక్తి
కలిగేట్లు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథునితో నీ వల్ల గంగ భూమి మీదకు వచ్చింది కాబట్టి భాగీరథి అని అన్నాడు.
మూడు విధాలుగా ప్రవహించింది కాబట్టి త్రిపథగ అని పిలుస్తారు. మూడు విధాలుగా అంటే
ఆకాశం నుండి శివుని శిరస్సు మీదకు, శివుని శిరస్సునుండి బిందు సరస్సు, అక్కడి నుండి సాగరానికి మూడు విధాలు గా ప్రవహించినందున త్రిపథగ
అంటారు.
ఈ గంగావతరణం ఎవరు చదువుతారో, వింటారో వారికి అన్ని విధాల కోరికలు తీరి ఆరోగ్యవంతులై ఉంటారని
బ్రహ్మ వరమిచ్చాడు.
విశాలదేశ చరిత్ర
ఒకనాడు దుర్వాసుడు ఒక పుష్పహారాన్ని ఐరావతము మీద ఉన్న
దేవేంద్రునకు ఇచ్చాడు. ఇంద్రుడు దానిని నిర్లక్ష్యంగా ఆ ఏనుగు మీద వేశాడు. ఐరావతము
ఆ పూల దండను తన మీదనుండి తీసి కాళ్ళకింద వేసుకొని తొక్కింది. నేనిచ్చిన బహుమానమంటే
ఇంత లెక్కలేని తనమా అని "నీ
ఐశ్వర్యమంతా నశించిపోవుగాక" అని శపించాడు.
వెంటనే ఇంద్రుని ఐశ్వర్యమంతా పాల సముద్రంలో కలసి పోయి ఇంద్రుడు
పేదవాడిగా మిగిలాడు. అప్పుడు ఇంద్రుడు విష్ణుమూర్తి ప్రార్ధిస్తే "ఎప్పుడూ
ఇలా గొప్ప వారి పట్ల నిర్లక్ష్యంగా
ఉండొద్దని, క్షీర
సాగరాన్ని చిలికితే సంపదంతా బయటకు వస్తుందని" చెప్పాడు. దానితోపాటు అమృతం
కూడా వస్తుందని చెప్పాడు.
పాలసముద్రం చిలకాలంటే ఒక్క దేవతల వల్ల కాదు. అందుకని అమృతం కోసం
పాలసముద్రం చిలుకుదామని రాక్షసుల సహాయంతో ఆ కార్యక్రమమాన్ని పూర్తి
చేద్దామనుకున్నారు.
మందర పర్వతాన్ని
కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకొని చిలుకుతుంటే హాలాహలం పుట్టింది.
దాన్ని పరమేశ్వరుడు కంఠంలో దాచి లోకాలను రక్షించాడు. మళ్ళీ చిలకడం మొదలుపెడితే
మందర పర్వతం మునిగిపోయింది. అప్పుడు
విష్ణుమూర్తి కూర్మావతారమెత్తి మందరపర్వతాన్ని తన వీపు మీద నిలిపాడు.
దేవతలు, రాక్షసులు
మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. అప్పుడు ఉఛ్ఛైశ్రవం అనే గుర్రం, కామధేనువు, కల్పవృక్షం, అప్సరసలు, ఐరావతం
పాలసముద్రంలో నుంచి వచ్చాయి. ఆ తరువాత ధన్వంతరి అమృతంతో ఉద్భవించాడు.
అమృతం కోసం రాక్షసులు దేవతలతో యుద్ధం చేస్తుంటే శ్రీహరి మోహినీ
అవతారంలో అమృతం పంచి దేవతలను రక్షించాడు. అమృతం సేవించిన దేవతలు ఇంద్రుడి
నేతృత్వంలో రాక్షసులను వెంటాడి చంపివేసాడు.
దాంతో రాక్షసుల తల్లైన దితి ఇంద్రుని చంపే కొడుకు కావాలని పంతం
పట్టి భర్త కశ్యపునిచే గర్భవతి అయింది.
కశ్యపుడు నీవు వెయ్యి సంవత్సరాల కాలం నియమనిష్టలతో ఉంటే నీకు కావలసిన కొడుకు
పుడతాడని వరమిచ్చాడు. ఈ విషయం తెలిసి ఇంద్రుడే పినతల్లికి సేవలు చేస్తూ వచ్చి ఆమె
నియమ భంగమవగానే నిద్రపోయేటప్పుడు గర్భలోకి వెళ్లి పిండాన్ని ఏడు భాగాలుగా
ఖండించాడు. నిద్రనుంచి లేచిన దితి అయ్యో నియమం ప్రకారం పగటి నిద్ర పోగూడదు.
అందువల్ల ఇలా జరిగిందని బాధపడింది. దానికి ఇంద్రుడు తల్లీ, బాధపడకు నీకు ఏడుగురు పిల్లలు పుడతారు. వారిని
మరుత్తులుగా పిలుస్తారు. వీరు బ్రహ్మ లోకంలో, ఇంద్రలోకంలో, ఆకాశంలో
ఒక్కొక్కడిని, మిగతా నలుగురిని నాలుగు
దిక్కులందు దేవతల ఆకారంతో వాయురూపంలో ఉంటారు. వీరికి గగనము , స్పర్శనము,
వాయువు, అనిలుఁడు, ప్రాణము, ప్రాణేశ్వరుడు, జీవుడు ఈ సప్తమరుత్తులను పిలుస్తారు. అప్పుడు దితికి ఇంద్రుడు
సేవ చేస్తే మరుత్తులు పుట్టిన ప్రదేశాన్ని విశాలదేశం అని పిలుస్తారు. దీనికి రాజు
సుమతి.
గౌతమ ఆశ్రమ వృత్తాంతం
గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలసి ఎన్నో సంవత్సరముల నుండి
మిథిలా నగరానికి దగ్గరలో వున్న ఆశ్రమంలో ఉంటున్నాడు. అహల్య బ్రహ్మ సృష్టి లోని ఒక
అద్భుత సౌందర్యవతి. ఇంద్రునికి ఎప్పటినుండో అహల్య పైన వ్యామోహం వున్నా గౌతముని
శాపభయం కారణంగా అటువైపు రాలేక పోయాడు. ఒకరోజు ఇక ఎలాగయినా అహల్యతో గడపాలని
నిశ్చయించుకున్న ఇంద్రుడు, గౌతముడు
ఆశ్రమంలో లేని సమయం చూసి గౌతముని వేషంలోనే ఆశ్రయంలో అడుగు పెట్టాడు. ఇంద్రుని
గుర్తించి కూడా అహల్య అతనితో గడిపింది.
అహల్యనుండి తాను అనుకున్నది సాధించిన ఇంద్రుడు తృప్తిగా తిరిగి
తన ఇంటికి బయలుదేరాడు. ఆశ్రమం బయట అడుగు పెడుతూనే తిరిగి వచ్చిన గౌతమ మహర్షిని
చూసి భయంతో వణుకుతూ నించున్నాడు. గౌతముడు
ఇంద్రుని చూసి జరిగిన వ్యవహారమంతా తెలుసుకొని, ఇంద్రా స్వర్గాధిపతివి, ధర్మం తప్పి పరభార్యను కామించినందుకు నీ వృషణాలు రాలిపోతాయి అని
శపించాడు.
అహల్యను చూసి “నీకు
తెలిసీ తప్పు చేసినందుకు ఆహారం లేకుండా ఎవరికీ కనిపించకుండా ఇక్కడే దుమ్ములో కలసి
ఉంటావు. ఎప్పుడైతే దశరథ కుమారుడు, రాముడు ఈ ఆశ్రమంలో అడుగు పెడతాడో అప్పుడు నీ శాపం తొలుగుతుంది” అని శాపం పెట్టి ఆశ్రమ విడిచి వెళ్ళిపోయాడు. అప్పటినుండి రాముడు వచ్చే
వరకూ ఆ ఆశ్రమ ఆవరణం లోని దుమ్ము,
ధూళిలో అదృశ్యంగా పడివున్న అహల్య, లక్ష్మణ విశ్వామిత్రులతో కలసి రాముడు ఆ ఆశ్రమంలో అడుగు
పెట్టగానే ఆమెకు పూర్వ రూపం వచ్చేసింది.
విశ్వామిత్రుని వృత్తాంతం
మిథిలలో జనకుని పురోహితుడు శతానందుడు, రామునితో విశ్వామిత్రుడు రాజు నుంచి బ్రహ్మర్షిగా మారిన వృత్తాంతం వివరించాడు.
గాధి రాజు కొడుకైన విశ్వామిత్రుడు అనేక సంవత్సరాలు రాజ్య
పాలనచేసి కొత్త ప్రాంతాలను చూడాలనే కోరిక మీద భూమి పై వున్న ఆశ్రమాలు
పట్టణాలు, నదులు, కొండలు
కోనలూ తిరుగుతూ ఒక రోజు వసిష్ఠుని ఆశ్రమానికి చేరాడు.
విశ్వామిత్ర మహారాజు వసిష్ఠుని కలసి వినయ, విధేయతలతో ఆయన క్షేమ సమాచారాన్ని తెలుకున్నాడు.
వసిష్ఠుడు కూడా
సంతోషించి రాజా అందరమూ క్షేమంగా మావిధులను ఆచరిస్తున్నాము. మీరు
వచ్చినందుకు సంతోషము. మీరు మా ఆతిధ్యము స్వీకరించి వెళ్ళండి. అన్నాడు
అప్పుడు విశ్వామిత్రుడు మహర్షీ మేము సైన్యంతో చాలా పెద్ద
పరివారంతో వున్నాము. మీరు ఇబ్బంది పడవద్దు. అన్నాడు.
వసిష్ఠుడు శబల అను తన కామధేనువును పిలిచి నేను ఈ రాజ
పరివారానికి విందు పెట్టాలని అనుకుంటున్నాను. అందరికి మంచి భోజనం ఏర్పాటు
చేయమన్నాడు.
కామధేనువు వసిష్ఠుని కోరిక ప్రకారం అద్భుతమైన విందు ఏర్పాటు
చేసింది. అందరూ గొంతు వరకు సుష్టుగా భోజనం చేశారు. ఇదంతా ఆశ్చర్యంతో చూసిన విశ్వామిత్రుడు, వసిష్టునితో మహర్షీ ఈ కామధేనువు తపస్సు చేసుకునే మీ దగ్గరకన్నా
రాజులమైన మా దగ్గరే ఉండాలి. మీరు కామధేనువును నాకు ఇవ్వండి. బదులుగా మీకు లక్ష
గోవులను ఇస్తాను అన్నాడు. దానికి వసిష్ఠుడు నవ్వుతూ మహారాజా మీరు ఏమి ఇచ్చినా
కామధేనువును ఇవ్వలేను. అన్నాడు. దాంతో కోపం తెచ్చుకున్న విశ్వామిత్రుడు బలవంతంగా
కామధేనువు తీసుకెళ్ళటానికి ప్రయత్నించాడు.
కామధేనువు వసిష్టునితో "మహాత్మా మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి ఈ
రాజును, సైన్యాలను నాశనము చేస్తానన్నది”.
దానికి “సరే” అన్నాడు వసిష్ఠుడు.
అంతే కామధేనువు శరీరం నుంచి అంతులేని సైన్యం వచ్చి, విశ్వామిత్రుని సర్వ సైన్యాన్ని చంపి వేసింది.
విశ్వామిత్రుని నూరుగురు కొడుకులు
ఒక్కసారిగా వసిష్ఠుని పైకి వెళ్లగా, వసిష్ఠుని ఒక్క హుంకరింపుతో వాళ్ళందరూ చచ్చిపోయారు.
సర్వ సైన్యాన్ని, కొడుకులనూ పోగొట్టుకున్న విశ్వామిత్రుడు తనకు అస్త్ర, శస్త్రాలు సరిగా లేవని శివుని గురించి కొన్ని సంవత్సరాలు ఘోరమైన
తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాక ఈ సృష్టి లోని అన్ని అస్త్ర, శస్త్రాలనూ తనకు ఉపదేశించమని కోరాడు. శివుడు ఇచ్చాడు.
ఆ అస్త్ర, శస్త్రాల
బలంతో మళ్ళీ వసిష్ఠుని చంపాలని వెళ్ళాడు. వసిష్ఠుడు ఆయన చేతిలో వున్న బ్రహ్మదండంతో
ఎదురుగా నించున్నాడు.అస్త్ర, శస్త్రాలన్నీ
బ్రహ్మదండంలో కలిసిపోయాయి. బ్రహ్మాస్త్ర మేసాడు. దాన్ని వసిష్ఠుడు మింగి వేసాడు.
దాంతో బ్రాహ్మణ బలం ముందు క్షత్రియ బలం పనికి రాలేదు, దీని అంతటికీ కారణం తపోబలమని గ్రహించి
రాజ్యాన్ని విడిచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు.
వెయ్యి సంవత్సరాలపాటు ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ
ప్రత్యక్షమయ్యాడు. “రాజర్షీ” ఏమి కావాలన్నాడు? తాను
బ్రహ్మర్షి కావాలనున్నాడు, కానీ
ఇంత కష్టపడితే రాజర్షి స్థాయికి మాత్రమే చేరాననుకుని మళ్ళీ మరో వేయి సంవత్సరాలు
తపస్సు చేశాడు.
ఇంతలో అయోధ్య రాజు త్రిశంకుడనే వాడు శరీరంతో స్వర్గానికి
వెళ్లాలని వసిష్ఠుణ్ణి అడిగాడు. ఆయన కుదరదన్నారు. తరువాత త్రిశంకుడు వసిస్థుని
కుమారుల వద్దకు వెళ్లి మా రాజగురువే నా కోరికను తీర్చడంలేదు. మీకు ఏమి కావాలన్నా
ఇస్తాను నన్ను బొందితో స్వర్గానికి పంపమన్నాడు.
వసిష్ఠుని కొడుకులు త్రిశంకునితో "గురువును ధిక్కరించావు
కాబట్టి చండాలుడివి అవమని" శపించారు.
రాజధానికి వెళ్లిన రాజు మరునాడు నిద్ర లేచేసరికి చండాలునిగా
మారిపోయాడు. ఆయనను ఎవ్వరూ గుర్తుపట్టలేదు. తన కోరిక తీరలేదు పైగా శాపగ్రస్తుడిని
అయినానని బాధ పడ్డాడు
వసిష్ఠ విశ్వామిత్రుల శత్రుత్వం తెలిసి, విశ్వామిత్రుని వద్దకు వెళ్లి తనను స్వర్గానికి పంపమన్నాడు.
విశ్వామిత్రుడు వసిష్టునికన్నా గొప్పవాడని అనిపించుకోవాలని త్రిశంకుని తన తపో
బలంతో సశరీరంగా స్వర్గానికి పంపాడు. స్వర్గానికి వెళ్లిన త్రిశంకుని స్వర్గంలోకి
వచ్చే అర్హత లేదని కిందికి నెట్టి వేశారు.
తలకిందులుగా పడిపోతున్న త్రిశంకుడు విశ్వామిత్రుని కాపాడమని
అరిచాడు. విశ్వామిత్రుడు వెంటనే త్రిశంకుని తలకిందులుగానే ఆపి మరో స్వర్గాన్ని
సృష్టించాడు. ఆ సంఘటనతో తపోబలమంతా పోగొట్టుకున్న విశ్వామిత్రుడు తిరిగి మరో వేయి
సంవత్సరాలు తపస్సు చేసాడు.
ఆ సమయంలో అంబరీషుడు అనే రాజు యజ్ఞం చేస్తూ ఉండగా ఇంద్రుడు యజ్ఞం
లో బలిగా వున్న పశువును దొంగిలించాడు. దానితో అంబరీషుడు బాధపడి ఎవెరైనా మనుష్యుడు
తనంత తానుగా యజ్ఞంలో బలి అవుతాడేమోనని వెతకమన్నాడు. శునస్సేపుడు అనే పిల్లవాడు
విశ్వామిత్రుని మేనల్లుడు, ఆ
బాలుడు తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోవడం లేదనుకొని తాను ఆ బలి పశువుగా వస్తానని
చెప్పాడు. రాజు శునస్సేపుడుని యజ్ఞపశువుగా తీసుకెళ్తున్నాడు. కానీ కొంత దూరము
వెళ్ళాక శునస్సేపుడు భయపడి దారిలో కనబడ్డ తన మేనమామ విశ్వామిత్రుని శరణుజొచ్చాడు.
విశ్వామిత్రుడు అతనికి తనని తాను రక్షించుకునే మంత్రాలను చెప్పి తపస్సుకు
వెళ్ళిపోయాడు. శునస్సేపుడు ఆ యజ్ఞం నుండి మంత్ర మహిమ వల్ల దేవతల దయవల్ల
బయటపడ్డాడు.
ఘోర తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడు ఒకరోజు అప్సరస మేనకను
చూసి ఐదు సంవత్సరాలపాటు ఆమెతో కాపురం చేశాడు. ఆమె మీద కోరిక తీరిన తర్వాత తాను
చేసిన తప్పు తెలుసుకున్నాడు. తపస్సు చెడగొట్టటానికి వచ్చిన మేనక మాయలో పడిపోయానని
గ్రహించి తిరిగి తీవ్రమైన తపస్సు చేశాడు. ఒక రోజు రంభ తపస్సు చెడగొట్టటానికి
వచ్చింది. రంభను శిల అవమని శపించాడు. మళ్ళీ ఆ ప్రదేశం వదిలి మరో ప్రదేశంలో దేనికీ చలించకుండా అతి తీవ్రమైన తపస్సు చేశాడు.
అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై బ్రహ్మర్షి పదవినిచ్చాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు
చాలా గొప్పవాడయ్యాడు. అని శతానందుడు రామునికి చెప్పాడు.
శుభం.
శ్రీ రామనుతి (సంక్షిప్త రామాయణం - బాలకాండ) శ్రీ వాసుదాస విరచితం
|
శ్రీమద్రవికుల దీపక రామ శ్రితజన కల్పక సీతా రామ రాక్షస కులబల శిక్షక రామ భక్తావనసువి చక్షణ రామ మాయాతీత గుణాంచిత రామ సత్వైకగుణాదిష్ఠిత రామ యక్షేశ్వరహిత పూజిత రామ కరధృతధర్మ విరాజిత రామ నరసురవరదత్తాభయ రామ భాషాతీత గుణాంచిత రామ ధృతమానవ రూపాంచిత రామ నతవిధిశక్రో మాధవ రామ కౌసల్యావర నందన రామ
|
దశరథతోషణ కారణ రామ ఘోరాసురయోషాంతక రామ కౌశికలబ్ధాఖిలశర రామ విశ్వామిత్రసవావన రామ మారీచస్మయవారక రామ చైతన్యదపటుపదనఖ రామ గౌతమహృదయానందన రామ జనకతపఃఫల రూపక రామ ఖండితభర్గశరాసన రామ క్షోణీతనయా సంగత రామ నిర్జితభార్గవకులమణి రామ సాకేతపురీభూషణ రామ సీతాహృత్పంజర శుక రామ
|
రామ రామ శ్రీ రామా రామ
రామ రామ జయ సీతారామ
అంతటా సంభావ్యత (Probability) అనేది ఉంటుంది. పన్నెండేళ్ళు సుఖముగా వున్నారంటే..
భగవంతునికి కూడా కష్టాలు రాబోతున్నాయా!? మునుముందు ఏమి జరగబోతోంది??
అయోధ్య కాండలో
చూద్దాం..
బాలకాండను కథలుగా చేసి నా మనుమరాలు సహస్రకు చెప్పాను.
సహస్రకి, తాటక
వధ, యాగ రక్షణ, విశ్వామిత్రుని
చరిత్ర, శివధనుర్బంగం, పరశురామ
గర్వభంగం బాగా నచ్చాయి.
తనకు curiosity create చెయ్యడానికి ఇప్పటిదాకా సుఖంగా ఉన్న ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ కి కష్టాలు
రాబోతున్నాయి అని హింట్ ఇవ్వడంతో నెక్స్ట్ స్టోరీ ఎప్పుడు చెప్తావు తాతా అని వెంటపడుతోంది.
ఇక
అయోధ్యకాండకు ప్రిపేర్ అవ్వాలి
[1] అంగదేశం - బాలకాండ లో ఇతర కథలు ...
[2] మలద, కరూశ - బాలకాండ లో ఇతర కథలు ...
[3] తాటక - బాలకాండ లో ఇతర కథలు ...
[4] సిద్ధాశ్రమం - బాలకాండ లో ఇతర కథలు ...
[5] విశ్వామిత్రుని
వంశ చరిత్ర - బాలకాండ లో ఇతర కథలు ...
[6] కుమారస్వామి జననం - బాలకాండ లో ఇతర కథలు ...
[7] గంగావతరణం - బాలకాండ లో ఇతర కథలు ...
[8] విశాల నగర చరిత్ర
- బాలకాండ లో
ఇతర కథలు
...
[9] గౌతమ మహర్షి, అహల్యల కథ - బాలకాండ లో ఇతర కథలు ...
[10] విశ్వామిత్ర చరిత్ర - బాలకాండ లో ఇతర కథలు ...